New UPI Feature: యూపీఐలో మరో సంచలనం.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, పేమెంట్స్‌ను ఈఎంఐలుగా కట్టొచ్చు
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, పేమెంట్స్‌ను ఈఎంఐలుగా కట్టొచ్చు

New UPI Feature: భారతదేశపు నంబర్ వన్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ, వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రూపే క్రెడిట్ కార్డ్, క్రెడిట్ లైన్ వంటి ఫీచర్లను తీసుకొచ్చిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు మరో కీలకమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అదేమిటంటే... కస్టమర్లు యూపీఐ ద్వారా చేసే చెల్లింపులను ఈఎంఐలుగా విభజించే సదుపాయం. ఈ కొత్త ఫీచర్ ద్వారా పెద్ద మొత్తంలో చేసే చెల్లింపులు కూడా సులభతరం కానున్నాయి.
యూపీఐ చెల్లింపులను ఈఎంఐలుగా మార్చే ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉంది. ఇది ఆమోదం పొంది, అమలులోకి వస్తే, యూపీఐ వినియోగం మరింత పెరుగుతుంది. కస్టమర్లు దుకాణాల్లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నప్పుడే ఈఎంఐ ఆప్షన్ ఎంచుకునే అవకాశం లభిస్తుంది.
క్రెడిట్ కార్డుతో పీఓఎస్ మెషిన్ వద్ద పేమెంట్ చేస్తున్నప్పుడు, పెద్ద మొత్తాన్ని ఈఎంఐలుగా మార్చుకునే సదుపాయం ఉన్నట్లే, యూపీఐలో కూడా ఈ సౌలభ్యాన్ని తీసుకురావాలని ఎన్‌పీసీఐ భావిస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, పేటీఎం, ఫోన్‌పే, క్రెడ్ వంటి ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్స్ కూడా యూపీఐ చెల్లింపులపై ఈఎంఐ ఆప్షన్స్‌ను అందించడానికి వీలు కలుగుతుంది.
ప్రస్తుతం యూపీఐలో జరిగే ఎక్కువ లావాదేవీల వల్ల బ్యాంకులు లేదా ఫిన్‌టెక్ సంస్థలకు పెద్దగా ఆదాయం లభించడం లేదు. అందుకే, ఎన్‌పీసీఐ కొత్త ఆదాయ మార్గాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఈఎంఐ ఆప్షన్‌పై దాదాపు 1.5% ఇంటర్‌మిటెంట్ ఫీ వసూలు చేయాలని ఎన్‌పీసీఐ యోచిస్తోంది. ఈ ఫీజు ద్వారా బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలకు ఆదాయం లభిస్తుంది.
ఈ ఈఎంఐ ఫీచర్ ముఖ్యంగా పెద్ద మొత్తంలో చేసే చెల్లింపులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఎక్కువ మొత్తంలో చెల్లించడానికి క్రెడిట్ కార్డులు వాడుతున్న వారు, ఇకపై యూపీఐలోనే ఆ పని పూర్తి చేయవచ్చు. దీని వల్ల యూపీఐ వినియోగం మరింత పెరగడంతో పాటు, హై-వాల్యూ పేమెంట్స్ విభాగంలో కూడా యూపీఐ ఆధిపత్యం సాధించడానికి అవకాశం ఉంటుంది.
ఈ తరహా సేవలను అందించడానికి ఇప్పటికే పలు బ్యాంకులు, పేటీఎం, నవీ వంటి ఫిన్‌టెక్ కంపెనీలతో జతకట్టి వినియోగదారులకు క్రెడిట్ లైన్ ఆఫర్ చేస్తున్నాయి. భవిష్యత్తులో ఈఎంఐ ఫీచర్ విషయంలోనూ బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థల మధ్య ఇలాంటి భాగస్వామ్యం కొనసాగే అవకాశం ఉంది.
