టీవీ, ఫ్రిజ్ కొనేముందు ఇది చూడకపోతే అడ్డంగా బుక్కైనట్లే

New Year Rules : కొత్త ఏడాది 2026 ఆరంభంలోనే సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. ఇంటికి ఫ్రిజ్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలనుకునే వారు ఇకపై ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఇప్పటి వరకు కొన్ని వస్తువులకే పరిమితమైన స్టార్ లేబులింగ్ నిబంధనను జనవరి 1 నుంచి మరిన్ని ఉపకరణాలకు కేంద్రం తప్పనిసరి చేసింది. దేశంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించి, ఇంధన ఆదాను ప్రోత్సహించడమే లక్ష్యంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఈ కొత్త గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది.

జనవరి 1 నుండి అమల్లోకి

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. జనవరి 1, 2026 నుంచి ప్రతి ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ తమ ఉత్పత్తులపై తప్పనిసరిగా ఇంధన దక్షతను తెలిపే స్టార్ రేటింగ్ లేబుల్స్‌ను ప్రదర్శించాలి. ముఖ్యంగా రెఫ్రిజరేటర్లు, టెలివిజన్లు, ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్‌లు, కూలింగ్ టవర్లు, డీప్ ఫ్రీజర్ల వంటి పరికరాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. గతంలో కలర్ టీవీలు, అల్ట్రా హై డెఫినిషన్ టీవీలు, ఫ్రాస్ట్ ఫ్రీ రెఫ్రిజరేటర్లకు స్టార్ రేటింగ్ అనేది కంపెనీల ఇష్టానుసారం ఉండేది. కానీ, ఇప్పుడు ఆ వెసులుబాటును తొలగించి, ప్రభుత్వం దీనిని కచ్చితం చేసింది.

కరెంటు బిల్లు తగ్గే అవకాశం

మీరు కొనే వస్తువుపై ఎన్ని ఎక్కువ స్టార్స్ ఉంటే ఆ వస్తువు అంత తక్కువ విద్యుత్తును వాడుకుంటుందని అర్థం. ఉదాహరణకు 5-స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రిజ్ లేదా ఏసీని వాడితే మీ నెలవారీ కరెంటు బిల్లులో గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తుంది. ఇప్పటికే వాషింగ్ మెషీన్లు, సీలింగ్ ఫ్యాన్లు, గీజర్లు, ఎల్‌ఈడీ బల్బులకు ఈ నిబంధన అమల్లో ఉంది. అయితే, ఇప్పుడు వీటి పనితీరు ప్రమాణాలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. దీనివల్ల కంపెనీలు నాణ్యమైన, తక్కువ విద్యుత్ ఖర్చయ్యే వస్తువులనే తయారు చేయాల్సి ఉంటుంది.

జూలై 2025 నుంచే సన్నాహాలు

ఈ కొత్త నిబంధనలపై ప్రభుత్వం జూలై 2025లోనే ముసాయిదా చట్టాన్ని విడుదల చేసి ప్రజల అభిప్రాయాలను సేకరించింది. ఆ నివేదిక ఆధారంగానే ఇప్పుడు అధికారిక నోటిఫికేషన్ వెలువడింది. కేవలం గృహోపకరణాలే కాకుండా పారిశ్రామిక అవసరాలకు వాడే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల మీద కూడా స్టార్ లేబులింగ్ ఉండాలని బీఈఈ స్పష్టం చేసింది. ఒకవేళ ఏ కంపెనీ అయినా ఈ రూల్స్ పాటించకపోతే వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు, ఆ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story