FASTag KYC : ఫాస్ట్‌ట్యాగ్ హోల్డర్లకు అలర్ట్.. అలా చేయకపోతే టోల్ గేట్ దాటలేరు
అలా చేయకపోతే టోల్ గేట్ దాటలేరు

FASTag KYC : మీ వాహనం హైవేలపై ప్రయాణిస్తున్నట్లయితే, ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగిస్తున్న వాళ్లకు అలర్ట్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుల కోసం కేవైసీ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం కేవైసీ ధృవీకరణ గతంలో కంటే వేగంగా, సులభంగా జరగనుంది. తప్పుడు వినియోగాన్ని అరికట్టి, పారదర్శకతను పెంచడానికి ఎన్‌హెచ్‌ఏఐ ఈ చర్య తీసుకుంది.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారుల సౌలభ్యం కోసం కేవైసీ (KYV - Know Your Vehicle) ప్రక్రియలో పెద్ద మార్పులు చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం కేవైసీ ప్రక్రియ కోసం ఇకపై కారు లేదా వ్యాన్ పక్క భాగం ఫోటో అవసరం లేదు. కేవలం ఫాస్ట్‌ట్యాగ్, నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించేలా ముందు భాగం ఫోటోను అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది.
వినియోగదారు తమ వాహనం నంబర్, ఛాసిస్ నంబర్ లేదా మొబైల్ నంబర్ నమోదు చేయగానే, సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఆ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వివరాలను వాహన్ పోర్టల్ నుంచి తీసుకుంటుంది. ఈ కొత్త పాలసీ అమలులోకి వచ్చినా, పాత ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దుర్వినియోగం లేదా ఫిర్యాదులు లేనంత వరకు వారి ఫాస్ట్‌ట్యాగ్ పనిచేస్తూనే ఉంటుంది. కేవైసీ పూర్తి చేయమని బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్ ద్వారా రిమైండర్‌లు వస్తాయి.
ఈ కొత్త కేవైసీ విధానాన్ని అమలు చేయడం వెనుక ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన ఉద్దేశాలు ఉన్నాయి. టోల్ ట్యాక్స్‌ను ఆదా చేయడానికి చాలా మంది ట్రక్కులు వంటి పెద్ద వాహనాలకు చిన్న కార్లకు జారీ చేసిన ఫాస్ట్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తున్నారని ఎన్‌హెచ్‌ఏఐకు ఫిర్యాదులు అందాయి. దీనిని అరికట్టడానికి ఈ కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. ఏ వాహనానికి ఫాస్ట్‌ట్యాగ్ జారీ అయిందో, అదే వాహనం దాన్ని ఉపయోగిస్తుందో లేదో తెలుసుకోవడానికి ఈ కేవైసీ ప్రక్రియను ఎన్‌పీసీఐ సహకారంతో అమలు చేస్తున్నారు.
ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని పూర్తి చేయడానికి లేదా అప్‌డేట్ చేయడానికి వినియోగదారులు అనుసరించాల్సిన పూర్తి ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది. మీ వాహనం ముందు భాగం ఫోటోను తీయాలి. అందులో ఫాస్ట్‌ట్యాగ్, నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించాలి. అవసరమైతే, వెహికల్ వీల్స్ స్పష్టంగా కనిపించేలా పక్క భాగం ఫోటోను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ స్కాన్ కాపీని అప్‌లోడ్ చేయండి. మీరు ఫాస్ట్‌ట్యాగ్ తీసుకున్న పోర్టల్ లేదా బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్లి, మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి. 'My Profile' సెక్షన్‌లోని 'KYC' ట్యాబ్‌లోకి వెళ్లి, అప్‌లోడ్ ప్రక్రియను పూర్తి చేయండి. మీరు అప్‌లోడ్ చేసిన వివరాలను బ్యాంక్, వాహన్ డేటాబేస్‌తో ధృవీకరిస్తుంది. వివరాలు సరిపోలకపోతే కేవైసీ పూర్తి కాదు.
ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మీరు మీ కేవైసీని అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల డేటా అప్‌డేట్‌గా ఉంటుంది. దుర్వినియోగం జరగదు. కేవైసీకి సంబంధించిన ఏవైనా సమస్యలు లేదా సందేహాల కోసం, మీరు జాతీయ రహదారి హెల్ప్‌లైన్ 1033ను సంప్రదించవచ్చు.

