Nirmala Sitharaman: న్యూఢిల్లీలో జరిగిన రెండు రోజుల పిఎస్‌బి కాన్ఫ్లూయెన్స్ 2026 ముగింపు సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. నేటి యువత ప్రైవేట్ బ్యాంకులను తమ మొదటి ఎంపికగా ఎంచుకోవడానికి గల కారణాలను ఆమె విశ్లేషించారు. ప్రైవేట్ బ్యాంకులు డిజిటల్ సేవలు, కస్టమర్ అనుభవంలో ఎంతో ఆకర్షణీయంగా ఉంటున్నాయని, అదే స్థాయిలో ప్రభుత్వ బ్యాంకులు కూడా తమ రూపురేఖలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలో బ్యాంకింగ్ భద్రతా ప్రమాణాలతో ఎలాంటి రాజీ పడకూడదని కూడా హెచ్చరించారు.

అక్టోబర్ 2 నుంచి ప్రత్యేక బ్యాంకింగ్ ఫర్ యూత్ డ్రైవ్

యువతను ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడానికి అక్టోబర్ 2 నుంచి నెల రోజుల పాటు బ్యాంకింగ్ ఫర్ యూత్ పేరుతో ఒక ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టాలని ఆర్థిక మంత్రి సూచించారు. 16 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరిని బ్యాంకింగ్ సేవలకు అనుసంధానించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కేవలం బ్యాంక్ ఖాతా తెరిపించడమే కాకుండా, వారి చదువు, ఉద్యోగం, వ్యాపారం, మొదటి పొదుపు వరకు ప్రతి దశలో ప్రభుత్వ బ్యాంకులు భాగస్వామిగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని బ్యాంక్ శాఖలకే పరిమితం చేయకుండా కాలేజీలు, యూనివర్సిటీలు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లకు తీసుకెళ్లాలని సూచించారు.

యువత కోసం ఆకర్షణీయమైన ఆఫర్లు, ప్రత్యేక కౌంటర్లు

యువతను ఆకట్టుకోవడానికి కేవలం డిపాజిట్లు, రుణాలు మాత్రమే కాకుండా ఆన్‌లైన్ కోర్సులు, స్కిల్ ట్రైనింగ్, ఫిట్‌నెస్, యోగా సెంటర్ల కూపన్లు, మానసిక ఆరోగ్య వేదికల ప్రయోజనాలను కూడా బ్యాంకులు అందించాలని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రతి బ్యాంక్ బ్రాంచ్‌లో యువా కియోస్క్, యువా బ్యాంకింగ్ మిత్ర పేరుతో ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెచ్చారు. అక్కడ యువతకు అవసరమైన ఆర్థిక సేవలు, మార్గదర్శకత్వం లభిస్తాయి.

స్వయం ఉపాధి, స్టార్టప్‌లకు కొండంత అండ

సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు క్రెడిట్ స్కోర్ ప్రాధాన్యత, ప్రభుత్వ రుణ పథకాలు, రుణ మంజూరు ప్రక్రియలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని బ్యాంకర్లకు సూచించారు. సరైన సమయంలో ఆర్థిక సహాయం అందించడం ద్వారా యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు యువత నమ్మకమైన ఆర్థిక భాగస్వామిగా మారినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story