UPI: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అలాగే పలు ప్రముఖ మీడియా ఛానెళ్లలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన యూపీఐ లావాదేవీలపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో యూపీఐ లావాదేవీల వాల్యూమ్ 1.8 శాతం తగ్గిందనే వాదనలు వినిపించాయి. ప్రముఖ నివేదికల ప్రకారం పీక్ స్థాయిల నుంచి సెప్టెంబర్‌లో లావాదేవీలు 24.07 బిలియన్లకు పడిపోయాయని పేర్కొన్నారు. పైకి చూస్తే ఈ గణాంకాలు నిజమే అనిపించినప్పటికీ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమాచారాన్ని లోతుగా పరిశీలిస్తే వాస్తవాలు పూర్తిగా భిన్నంగా కనిపిస్తాయి. యూపీఐ వినియోగంలో ఎలాంటి క్షీణత లేదని, కేవలం నెలలోని రోజుల సంఖ్య మారడం వల్లే ఈ చిన్న వ్యత్యాసం ఏర్పడిందని స్పష్టమవుతోంది.

ఈ గణాంకాల వెనక ఉన్న అసలు గణితాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆగస్టు నెలలో మొత్తం 31 రోజులు ఉండగా, సెప్టెంబర్‌లో కేవలం 30 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ ఒక్క రోజు తేడా మొత్తం నెలవారీ టోటల్ గణాంకాలపై ప్రభావం చూపింది. ఆగస్టులో మొత్తం 24.51 బిలియన్ లావాదేవీలు జరగగా, రోజువారీ సగటు 791 మిలియన్లుగా నమోదైంది. అదే సెప్టెంబర్‌లో మొత్తం లావాదేవీలు 24.07 బిలియన్లుగా ఉన్నప్పటికీ, దీన్ని 30 రోజులతో భాగిస్తే రోజూవారీ సగటు ఏకంగా 802 మిలియన్లకు పెరిగింది. అలాగే లావాదేవీల విలువ పరంగా చూస్తే కూడా ఆగస్టులో రోజువారీ సగటు రూ.96,205 కోట్లుగా ఉండగా, సెప్టెంబర్‌లో అది రూ.97,913 కోట్లకు ఎగబాకింది. అంటే వాల్యూమ్, వాల్యూ పరంగా చూస్తే రోజువారీ వినియోగం మరింత పుంజుకుందని స్పష్టమవుతోంది.

ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ రంగంలో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురాబోతున్న నూతన మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధానంపై అందరి దృష్టి నెలకొంది. అక్టోబర్ 15 నుంచి రూ.2,000 పైబడిన మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ చార్జీలను వర్తింపజేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదిత నిబంధనలపై చిన్న వ్యాపారులు, పెద్ద రిటైలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఫెస్టివల్ సీజన్‌లో అదనపు భారం పడుతుందనే ఉద్దేశంతో కొన్ని సంఘాలు నిరసనలకు కూడా పిలుపునిచ్చాయి. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జరిగిన సమావేశం తర్వాత వ్యాపార సంఘాలు తమ నిరసనలను వెనక్కి తీసుకున్నాయి. పీటుపీ లావాదేవీలు ఎప్పటికీ ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టత రావడంతో ఆందోళనలు తగ్గా ముఖం పట్టాయి.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ వెన్నెముకగా నిలుస్తున్న యూపీఐ సేవలు రోజురోజుకు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్పీసీఐ దేశీయ రిటైల్ పేమెంట్స్‌ను విప్లవాత్మక మార్పుల వైపు నడిపిస్తోంది. జూలై నెలలో రూ.29.9 లక్షల కోట్ల రికార్డు స్థాయి విలువతో లావాదేవీలు జరిగాయి. ఈ అద్భుత విజయాలు కేవలం మన దేశానికే పరిమితం కాకుండా అంతర్జాతీయంగా కూడా విస్తరిస్తున్నాయి. యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్, ఖతార్ వంటి దాదాపు 11 దేశాల్లో యూపీఐ సేవలు విజయవంతంగా అమలవుతున్నాయి. గ్లోబల్ ఫిన్‌టెక్ రంగంలో భారత్ అగ్రగామిగా నిలవడానికి ఈ సాంకేతిక పురోగతే ప్రధాన కారణమని చెప్పవచ్చు.

Next Story