పెట్రోల్, డీజిల్ ధరల పెంపు లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం

No Fuel Shortage : మధ్యప్రాచ్యంలో నెలకొన్న తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన నిల్వలపై వస్తున్న వదంతులకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ప్రజలు అనవసరంగా భయపడి భారీగా ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని పెట్రోలియం శాఖ కార్యదర్శి సుజాత శర్మ స్పష్టం చేశారు. దేశంలోని అన్ని రిఫైనరీలు తమ పూర్తి సామర్థ్యంతో (100%) పనిచేస్తున్నాయని, సామాన్యుల వాడే ఇంధన ధరలను పెంచే ఆలోచన లేదని ఆమె భరోసా ఇచ్చారు.

అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల దేశంలో ఇంధనం దొరకదేమోనన్న భయంతో చాలా మంది పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కడుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. దేశంలో ముడి చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని, రిఫైనరీలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని హామీ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం లేదని, సరఫరా గొలుసులో ఎక్కడా ఆటంకాలు లేవని సుజాత శర్మ పేర్కొన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని, అవసరమైన మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని ఆమె కోరారు.

గ్యాస్ సరఫరాలో లోటు లేదు

గృహ అవసరాలకు వాడే ఎల్‌పీజీ బుకింగ్‌లు అకస్మాత్తుగా పెరిగినప్పటికీ, డెలివరీ ప్రక్రియ సాధారణంగానే సాగుతోందని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే వంట గ్యాస్ పై ఒత్తిడి తగ్గించేందుకు పీఎన్‌జీ కనెక్షన్లను పెంచుతున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు 2.20 లక్షల మంది వినియోగదారులు పీఎన్‌జీకి మారగా, మరో రెండున్నర లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు వాహనాలకు వాడే సీఎన్‌జీ సరఫరా కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందని, హోటళ్లు, రెస్టారెంట్ల కోసం 26 టన్నుల కమర్షియల్ గ్యాస్‌ను సప్లై చేశామని పేర్కొంది.

బ్లాక్ మార్కెటింగ్‌పై ఉక్కుపాదం

ఇదే అదనుగా భావించి కొందరు అక్రమార్కులు సిలిండర్లను బ్లాక్ లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో దాదాపు 2000 గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కిరోసిన్ కేటాయింపులు కూడా అన్ని రాష్ట్రాలకు సక్రమంగా జరిగాయని, ఇప్పటికే 16 రాష్ట్రాలకు అలొకేషన్ ఆర్డర్లు జారీ చేశామని అధికారులు స్పష్టం చేశారు.

గ్లోబల్ చర్చలు - భారతీయుల రక్షణ

గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నౌకలు, నావికుల భద్రతపై ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోంది. ప్రస్తుతం అక్కడ 20 నౌకలు, 540 మంది నావికులు సురక్షితంగా ఉన్నారని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ముంద్రా పోర్టులో సరుకు నిల్వకు 15 రోజుల పాటు ఉచిత స్టోరేజ్ సౌకర్యం కల్పించారు. మరోవైపు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడారని, హార్ముజ్ జలసంధిని సురక్షితంగా ఉంచడంపై వారు చర్చించారని తెలిపారు. ఇరాన్, శ్రీలంక వంటి దేశాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని, విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతే తమ తొలి ప్రాధాన్యత అని కేంద్రం భరోసా ఇచ్చింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story