అప్పటివరకు ప్రీమియం కట్టడం ఆపాలా?

GST on Insurance : కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీలో చేసిన మార్పులలో ప్రజల దృష్టిని ఆకర్షించిన ముఖ్యమైన నిర్ణయం, ఇన్సూరెన్స్ ప్రీమియంపై ఉన్న జీఎస్టీని రద్దు చేయడం. వ్యక్తిగత హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంలపై 18 శాతం ఉన్న జీఎస్టీని జీరోకు తగ్గించారు. ఈ నిర్ణయం సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి రానుంది. దీని వల్ల ఇన్సూరెన్స్ ప్రీమియంలు దాదాపు 15 శాతం వరకు తగ్గుతాయని అంచనా. ప్రస్తుతం సెప్టెంబర్ 22కు ముందు చెల్లించే ఇన్సూరెన్స్ ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. కాబట్టి, జీఎస్టీని తప్పించుకోవడానికి సెప్టెంబర్ 22 వరకు వేచి ఉండాలా అనే సందేహం చాలామందిలో ఉంది. ఇక్కడ మీరు కొన్ని విషయాలు గమనించాలి.

సాధారణంగా, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడానికి ఒక గడువు ఉంటుంది. ఆ గడువు తర్వాత కొన్ని రోజుల పాటు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. వాహనాల ఇన్సూరెన్స్ పాలసీలకు గ్రేస్ పీరియడ్ ఉండదు, అవి గడువు ముగిసిన వెంటనే నిలిచిపోతాయి (లాప్స్ అవుతాయి). హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు సాధారణంగా 15 రోజులు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు 15 నుంచి 30 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ ఉండవచ్చు. మీ పాలసీ డాక్యుమెంట్స్‌లో గ్రేస్ పీరియడ్ ఎంత ఉందో చూసుకోవడం ముఖ్యం.

ఒకవేళ మీ ఇన్సూరెన్స్ ప్రీమియం గడువు, గ్రేస్ పీరియడ్ రెండూ దాటితే మీ పాలసీ నిలిచిపోతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ విషయంలో దాన్ని తిరిగి కొనసాగించడానికి (రివైవ్ చేయడానికి) మీరు అదనపు ఫీజు, వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. అలాగే, కొత్తగా వైద్య పరీక్షలు కూడా చేయించాల్సి ఉంటుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లాప్స్ అయితే, దాన్ని తిరిగి రివైవ్ చేయడం సాధ్యం కాదు. కొత్త పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల పాత పాలసీలో మీరు పొందిన నో క్లెయిమ్ బోనస్, వెయిటింగ్ పీరియడ్ వంటి ప్రయోజనాలు కొత్త పాలసీకి వర్తించవు. 18 శాతం జీఎస్టీని ఆదా చేసుకోవడానికి ప్రయత్నించి, పైన చెప్పిన రిస్క్‌లను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఒకవేళ మీ పాలసీ గ్రేస్ పీరియడ్ సెప్టెంబర్ 22 వరకు ఉన్నట్లయితే, మీరు ప్రీమియం చెల్లింపును ఆలస్యం చేయవచ్చు. లేదంటే, అదనపు ఛార్జీలు చెల్లించే బదులు, 18 శాతం జీఎస్టీతో ఇప్పటికిప్పుడు ప్రీమియం చెల్లించడం సరైన నిర్ణయం కావచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story