LPG : రెండు రోజుల్లో 87 లక్షల సిలిండర్ల డెలివరీ.. గ్యాస్ కొరత పై కేంద్రం క్లారిటీ
గ్యాస్ కొరత పై కేంద్రం క్లారిటీ

LPG : దేశంలో వంటగ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం శాఖ స్పందించింది. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని, నిరంతరాయంగా డెలివరీలు జరుగుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం రెండు రోజుల్లోనే దేశవ్యాప్తంగా 87 లక్షల సిలిండర్లను వినియోగదారులకు అందజేసినట్లు వెల్లడించింది. ప్రజలు ఆందోళన చెందవద్దని, పానిక్ బుకింగ్స్ (అనవసరపు ముందస్తు బుకింగ్స్) చేయవద్దని సూచించింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రతినిధి సుజాత శర్మ దేశంలో ఎల్పీజీ సరఫరాపై స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడా డ్రై అవుట్ (సరుకు అయిపోవడం) పరిస్థితి లేదని ఆమె స్పష్టం చేశారు. దాదాపు 95 శాతం సిలిండర్ల డెలివరీని అథెంటికేషన్ కోడ్ (OTP) ద్వారానే చేస్తున్నామని, దీనివల్ల అవకతవకలకు తావులేకుండా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. గత 48 గంటల్లోనే 87 లక్షల గృహ వినియోగ సిలిండర్లు డెలివరీ అయ్యాయంటేనే వ్యవస్థ ఎంత వేగంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
గృహ అవసరాలకే కాకుండా కమర్షియల్, ఆటో ఎల్పీజీ రంగాల్లోనూ అమ్మకాలు బలంగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. గత రెండు రోజుల్లో 15,900 టన్నుల కమర్షియల్ గ్యాస్ విక్రయాలు జరిగాయి. అలాగే ఆటోమొబైల్స్ కోసం 876 టన్నుల ఆటో ఎల్పీజీని సరఫరా చేశారు. చిన్న వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచిన 5 కిలోల సిలిండర్లు కూడా సుమారు 1.20 లక్షల వరకు అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉందని స్పష్టమవుతోంది.
నగరాల్లో పైపుల ద్వారా సహజ వాయువు (PNG) కనెక్షన్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీనివల్ల ఎల్పీజీ సిలిండర్లపై భారం తగ్గుతోంది. గత కొద్ది రోజుల్లోనే 6.31 లక్షల కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభమైంది. మరో 2.67 లక్షల కొత్త కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయి. సుమారు 6.93 లక్షల మంది పీఎన్‌జీ కోసం కొత్తగా రిజిస్టర్ చేసుకోగా, సుమారు 49 వేల మంది వినియోగదారులు తమకున్న ఎల్పీజీ కనెక్షన్లను స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చేశారు.
నిబంధనలను ఉల్లంఘించే డిస్ట్రిబ్యూటర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా 2,100 ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించి, ఇప్పటివరకు 3,139 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిబంధనలు పాటించని 366 మంది డిస్ట్రిబ్యూటర్లకు జరిమానా విధించగా, 75 మందిని సస్పెండ్ చేసింది. గ్యాస్ ఏజెన్సీలు నిల్వలు లేవని అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. రిఫైనరీల నిర్వహణ కూడా సాధారణంగానే జరుగుతోందని, రిలయన్స్ మరియు నాయరా రిఫైనరీల షట్డౌన్ ప్రక్రియ రెగ్యులర్ అని, దీనివల్ల సరఫరాకు ఎలాంటి ముప్పు లేదని తెలిపింది.

