London Trip Gift : చెన్నై కంపెనీ గొప్ప మనసు.. 1000 మంది ఉద్యోగులకు 7 రోజుల లండన్ టూర్
1000 మంది ఉద్యోగులకు 7 రోజుల లండన్ టూర్

London Trip Gift : చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్, చిన్న చిన్న బహుమతులు లేదా అప్పుడప్పుడు పిజ్జా పార్టీలు ఇచ్చి సరిపెట్టుకుంటూ ఉంటాయి. కానీ చెన్నైకి చెందిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు ఊహించని బహుమతి ఇచ్చి వార్తల్లోకెక్కింది. ఆ కంపెనీ తమ 1,000 మంది ఉద్యోగులకు పూర్తిగా కంపెనీ ఖర్చుతో కూడిన లండన్ ట్రిప్‌ను ప్రకటించింది. ఇది కేవలం ఒక ట్రిప్ మాత్రమే కాదు, కంపెనీ ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రాఫిట్ షేర్ బోనాంజా రివార్డు పథకంలో భాగం. తమ టాప్ పెర్ఫార్మింగ్ ఉద్యోగులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రణాళికను రూపొందించారు.
కంపెనీ ఈ లండన్ ట్రిప్‌ను కేవలం ప్రయాణంగా కాకుండా, ఉద్యోగులకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని ఇవ్వడానికి చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేసింది. ఇందుకోసం ఒక ప్రత్యేక బృందం నెలల తరబడి ఈ ట్రిప్‌లోని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించింది.
టూర్ ప్లాన్‌లో ఏముందంటే?
ఉద్యోగులు విండ్సర్ కాజిల్ ఆడియో-గైడెడ్ టూర్, రంగురంగుల కామెడెన్ మార్కెట్ సందర్శన, ఇంటర్‌కాంటినెంటల్ లండన్‌లో గ్రాండ్ టీమ్ డిన్నర్, లండన్ బ్రిడ్జ్, బిగ్ బెన్, పికాడిల్లీ సర్కస్, ట్రాఫాల్గర్ స్క్వేర్, మేడమ్ టుస్సాడ్స్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలను చూసే అవకాశాన్ని కంపెనీ కల్పించింది. ఈ ఏడు రోజుల అద్భుతమైన పర్యటన థేమ్స్ రివర్ క్రూయిజ్తో ముగుస్తుంది.
ఇంతకుముందు కూడా విదేశీ టూర్లు
ఉద్యోగులకు విదేశీ పర్యటనలు ఇవ్వడం ఈ కంపెనీకి కొత్తేమీ కాదు. గత కొన్నేళ్లుగా, ఈ సంస్థ సుమారు 6,000 మంది ఉద్యోగులను సింగపూర్, థాయిలాండ్, దుబాయ్, మలేషియా, స్పెయిన్ వంటి వివిధ దేశాలకు తీసుకెళ్లింది. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే, సంస్థ పురోగతి కూడా అంతే వేగంగా ఉంటుందని ఈ కంపెనీ బలంగా విశ్వసిస్తుంది. ఉద్యోగులను సంతోషంగా ఉంచడానికి, వారిని ప్రోత్సహించడానికి ఇది సరైన మార్గమని కంపెనీ భావిస్తోంది.
సోషల్ మీడియాలో ప్రశంసలు
కంపెనీ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక యూజర్ స్పందిస్తూ.. 1000 మందికి లండన్ ట్రిప్ ఇవ్వడమా? ఇది చూశాక మా కంపెనీ ఇచ్చే పిజ్జా పార్టీలు ఒక జోక్‌లా అనిపిస్తున్నాయి అని కామెంట్ చేశారు. మరొకరు ఇలాంటి లాభాల పంపిణీ సంస్కృతి చాలా అరుదుగా కనిపిస్తుంది. నిజంగా అభినందనీయం అని ప్రశంసించారు. చాలా మంది నెటిజన్లు దీనిని ఉద్యోగులపై నిజమైన పెట్టుబడిగా అభివర్ణించారు. ఇతర కంపెనీలు కూడా ఈ విధానాన్ని అనుసరించాలని సూచించారు.

