EPF Interest Rate : పీఎఫ్ ఖాతాదారులకు షాక్.. 10% వడ్డీ అనేది కేవలం కలేనా?
10% వడ్డీ అనేది కేవలం కలేనా?

EPF Interest Rate : ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాదారుల్లో గత కొద్ది రోజులుగా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పీఎఫ్ వడ్డీ రేటును ఏకంగా 10 శాతానికి పెంచబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై తాజాగా పార్లమెంటులో ఎంపీ విజయకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. పీఎఫ్ వడ్డీ పెంపుపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేస్తూ క్లారిటీ ఇచ్చింది. లోక్‌సభలో ఎంపీ విజయ్‌కుమార్ అలియాస్ విజయ్ వసంత్ ఒక కీలక ప్రశ్న వేశారు. పీఎఫ్ వడ్డీ రేటును 10 శాతానికి పెంచే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? దీని సాధ్యాసాధ్యాలపై ఏవైనా అధ్యయనాలు జరిగాయా? అని అడిగారు. దీనికి కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే బదులిస్తూ.. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని తేల్చి చెప్పారు. కనీసం కార్మిక సంఘాల నుంచి కూడా 10 శాతం వడ్డీ కావాలని అధికారికంగా ఎటువంటి విజ్ఞప్తులు అందలేదని ఆమె స్పష్టం చేశారు.
వడ్డీ రేటును ఎవరు నిర్ణయిస్తారు?
పీఎఫ్ వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం నేరుగా నిర్ణయించదు. దీని కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) అనే ఒక కమిటీ ఉంటుంది. ఇందులో ప్రభుత్వం, యజమానులు, కార్మిక సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీరంతా కలిసి చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. పీఎఫ్ ఫండ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని బట్టి ఎంత వడ్డీ ఇవ్వాలనేది ఖరారు చేస్తారు. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం.. ఈపీఎఫ్ఓ ఆదాయం పెరిగితేనే వడ్డీ రేటు పెరిగే అవకాశం ఉంటుంది.
10 శాతం వడ్డీ ఇవ్వడం ఎందుకు కష్టం?
ఈపీఎఫ్ స్కీమ్ 1952 నిబంధనల ప్రకారం.. సంస్థ తన దగ్గర ఉన్న నిధులను వివిధ చోట్ల పెట్టుబడి పెడుతుంది. ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాల నుండే ఖాతాదారులకు వడ్డీని చెల్లిస్తుంది. సంస్థ సంపాదించే దానికంటే ఎక్కువ వడ్డీని హామీ ఇవ్వడం సాధ్యం కాదని మంత్రి వివరించారు. ఖాతాలో నష్టాలు రాకుండా చూడటం సంస్థ ప్రాథమిక బాధ్యత. అంటే, మార్కెట్ నుంచి వచ్చే రిటర్న్స్ బాగుంటేనే వడ్డీ పెరుగుతుంది తప్ప, ప్రభుత్వం సొంతంగా పెంచే అవకాశం తక్కువ.
ఇతర సేవింగ్స్ స్కీమ్స్ తో పోలిక వద్దు
చాలామంది పీఎఫ్ వడ్డీని బ్యాంక్ ఎఫ్ డీలు లేదా ద్రవ్యోల్బణంతో పోలుస్తుంటారు. కానీ, ప్రభుత్వం దీనిపై కూడా క్లారిటీ ఇచ్చింది. ఈపీఎఫ్ అనేది పూర్తిగా దాని సొంత నిధుల ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడి పనిచేసే వ్యవస్థ. ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలతో దీనికి సంబంధం ఉండదు. కాబట్టి, ప్రస్తుతానికి పీఎఫ్ వడ్డీ రేటులో భారీ పెరుగుదల ఉంటుందని ఆశించడం అత్యాశే అవుతుంది. పెట్టుబడుల నుండి వచ్చే రాబడి స్థిరంగా ఉంటేనే భవిష్యత్తులో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

