రేర్ ఎర్త్ మాగ్నెట్ల తయారీకి కేంద్ర కేబినెట్ ఆమోదం

Rare Earth : ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఎర్త్ మెటల్స్ విషయంలో చైనాకు ఉన్న ఆధిపత్యం గురించి అందరికీ తెలుసు. అయితే, చైనా ఈ మెటల్స్‌పై ఆంక్షలు విధించినా దాని వల్ల భారత్‌కు పెద్దగా నష్టం ఉండదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం ప్రకటించారు. ఎందుకంటే రేర్ ఎర్త్ మాగ్నెట్‌లను దిగుమతి చేసుకునేందుకు చైనా, జపాన్, వియత్నాం, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికన్ ఫ్యాక్టరీలతో సహా అనేక దేశాలతో భారత్ ఒప్పందాలు చేసుకుంది. అందుకే భారత్‌కు కావాల్సిన మాగ్నెట్‌లు ఏ క్షణంలోనైనా అందుబాటులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ రేర్ ఎర్త్ మెటల్స్ దిగుమతులపై ఆధారపడకుండా, దేశంలోనే ఉత్పత్తిని పెంచడానికి భారీ ప్రణాళికను సిద్ధం చేసింది.

రేర్ ఎర్త్ మాగ్నెట్‌ల తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర కేబినెట్ బుధవారం రూ.7,280 కోట్ల భారీ ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించింది. ఈ మొత్తం పథకంలో ఐదేళ్ల కాలానికి రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ అమ్మకాలపై రూ.6,450 కోట్ల ప్రోత్సాహం ఉంటుంది. అలాగే ఏటా 6,000 టన్నుల రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ ను తయారు చేసే ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడానికి రూ.750 కోట్ల ఆర్థిక సహాయం కూడా అందిస్తారు. ప్రస్తుతం దేశంలో ఏటా సుమారు 4,000 టన్నుల రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ అవసరం ఉంది. అయితే ప్రభుత్వం ఈ కొత్త ఫ్యాక్టరీల ద్వారా అదనంగా ఉత్పత్తి చేసి, ఆ మిగులు రేర్ ఎర్త్ మాగ్నెట్‌లను విదేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద బూస్ట్‌గా మారనుంది.

రేర్ ఎర్త్ రంగంలో భారత్‌కు కొన్ని పెద్ద సవాళ్లు కూడా ఉన్నాయి. ఈ మెటల్స్ మైనింగ్ వల్ల పర్యావరణానికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఒక పెద్ద సమస్య. దీంతో పాటు సరైన టెక్నికల్ నాలెడ్జ్ లోపం, పెట్టుబడుల కొరత, ప్రాజెక్టులు ఆలస్యం కావడం వంటి కారణాల వల్ల ఇప్పటివరకు భారీ స్థాయిలో ఉత్పత్తి సాధ్యం కాలేదు. ఈ సవాళ్లపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక అంతర్జాతీయ సప్లయర్లు కూడా భారతదేశానికి అవసరమైన ఏటా సుమారు 2,000 టన్నుల ఆక్సైడ్ సరఫరా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కొత్త పథకం ద్వారా భారత్ త్వరలోనే ఈ రంగంలో ఆత్మనిర్భర్ గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story