Fertilizer Supply : పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ భారతదేశంలో వ్యవసాయ ఎరువుల సరఫరాపై ఎలాంటి ప్రభావం పడలేదని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆదివారం స్పష్టం చేసింది. భారత్‌కు ఎరువులు, ముడిసరుకును మోసుకొస్తున్న 20 నౌకల్లో 15 నౌకలు అత్యంత ప్రమాదకరమైన హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటి భారత తీరానికి వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నౌకల్లో 3.32 లక్షల టన్నుల యూరియా, 2.57 లక్షల టన్నుల డీఏపీ, 1.11... లక్షల టన్నుల సల్ఫర్ లోడ్ అయి ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరో ఐదు నౌకలు అమోనియా, యూరియాతో భారత్ చేరనున్నాయి.

కొత్త దేశాల నుంచి ప్రత్యామ్నాయ సరఫరా

హోర్ముజ్ జలసంధి, ఎర్రసముద్రం (రెడ్ సీ) మార్గాల్లో సముద్ర రవాణాకు ఆటంకాలు ఎదురైనప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ముందస్తు వ్యూహంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఒమాన్, మలేషియా, వియత్నాం, నైజీరియా, రష్యా, ఈజిప్ట్, నెదర్లాండ్స్ వంటి దేశాల నుంచి యూరియా దిగుమతికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే డీఏపీ, ఎన్‌పీకే ఎరువులను రష్యా, మొరాకో, జపాన్, సౌదీ అరేబియా దేశాల నుంచి సురక్షితంగా రప్పించారు. గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతిని రవాణా ఖర్చులు పెరిగినప్పటికీ, దేశంలోని రైతుల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం సకాలంలో స్పందించిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు.

లక్ష్యానికి మించి దేశీయ ఎరువుల ఉత్పత్తి

మధ్యప్రాచ్య సంక్షోభం వల్ల ఒకదశలో ఎరువుల కర్మాగారాలకు సహజ వాయువు (గ్యాస్) సరఫరా 65 శాతం తగ్గింది. అయితే ప్రస్తుతం గ్యాస్ సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోవడంతో దేశంలోని అన్ని యూరియా ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) దేశీయ యూరియా ఉత్పత్తి నిర్దేశిత లక్ష్యం 67.86 లక్షల టన్నుల కంటే ఎక్కువగా, అంటే 71.55... లక్షల టన్నులుగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఏడాదికి అవసరమయ్యే 383.9 లక్షల టన్నుల ఎరువుల అవసరాలకు గాను, ప్రభుత్వం ఇప్పటికే 51 శాతానికి పైగా అంటే 197.56... లక్షల టన్నుల నిల్వలను సిద్ధంగా ఉంచింది. కాబట్టి దేశంలో ఎక్కడా ఎరువుల కొరత వచ్చే ప్రసక్తే లేదని కేంద్రం రైతులకు భరోసా ఇచ్చింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story