UPI Charges: యూపీఐ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది
ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది

UPI Charges: టీ కొట్టు నుంచి మొదలుకుని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు నేడు ప్రతిఒక్కరూ డిజిటల్ లావాదేవీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయనున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారానికి చెక్ పెడుతూ పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) స్పష్టతనిచ్చింది. సాధారణ వినియోగదారులు, చిన్న వ్యాపారులకు యూపీఐ సేవలు ఎప్పటిలాగే ఉచితంగా అందుబాటులో ఉంటాయని, ఛార్జీలు విధించే ఉద్దేశం ఏమాత్రం లేదని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
2016 నుంచి ఉచితం.. మున్ముందు కూడా అదే బాట
2016లో యూపీఐ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సామాన్య ప్రజలకు ఇది పూర్తిగా ఉచితంగానే సేవలు అందిస్తోంది. కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు డబ్బులు పంపాలన్నా, లేదా నిత్యావసర వస్తువుల బిల్లులు చెల్లించాలన్నా వినియోగదారులపై ఎలాంటి అదనపు రుసుములు విధించడం లేదని, భవిష్యత్తులో కూడా వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుములు వసూలు చేసే ఆలోచన లేదని పీసీఐ స్పష్టం చేసింది. డిజిటల్ ఇండియా ఆశయాలకు అనుగుణంగా ప్రతీ ఒక్కరికీ ఇది సులభంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యమని తెలిపింది.
చిన్న వ్యాపారులకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ లేదు
యూపీఐ ఛార్జీల వార్తలతో ఆందోళన చెందుతున్న వీధి వ్యాపారులు, కిరాణా నిర్వాహకులకు కూడా ప్రభుత్వం, పీసీఐ స్పష్టమైన భరోసా ఇచ్చాయి. చిన్న వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను స్వీకరించడానికి ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ లేదా అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. దేశంలోని చిన్న వ్యాపార రంగాన్ని డిజిటల్ వ్యవస్థలో భాగస్వామ్యులను చేయడమే ఈ ప్లాట్‌ఫామ్ ముఖ్య ఉద్దేశమని పీసీఐ స్పష్టం చేసింది.
పెద్ద వ్యాపారులపై మాత్రమే నిర్ణయం?
యూపీఐ అనేది కేవలం ఒక సాధారణ ప్లాట్‌ఫామ్ మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్‌గా నిలిచింది. ఈ వ్యవస్థను సైబర్ దాడుల నుంచి రక్షించడానికి, సాంకేతిక మౌలిక వసతులను నిరంతరం మెరుగుపరచడానికి బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు, ఎన్‌పిసిఐ, ఆర్‌బీఐ భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ వ్యవస్థను దీర్ఘకాలం పాటు సమర్థవంతంగా నిర్వహించడానికి భవిష్యత్తులో పెద్ద వ్యాపార సంస్థల పై మాత్రమే ఛార్జీలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇది వారి వ్యాపార ఒప్పందాల్లో భాగమే తప్ప, సాధారణ వినియోగదారులపై దీని ప్రభావం ఏమాత్రం ఉండదు.

