Saudi Arabia : ఆ దేశంలో విదేశీయుల కోసం కొత్త నిబంధన..మందు కావాలంటే రూ.11 లక్షల జీతం ఉండాలట
మందు కావాలంటే రూ.11 లక్షల జీతం ఉండాలట

Saudi Arabia : సౌదీ అరేబియాలో దశాబ్దాలుగా మద్యం అమ్మకాలు, కొనుగోలుపై కఠిన నిషేధం ఉంది. అయితే ఇప్పుడు ఆ దేశంలో నివసిస్తున్న నాన్-ముస్లిం విదేశీయులు మద్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మద్యం కొనుగోలు చేయాలంటే ఎంత జీతం ఉండాలి అనే ప్రశ్న ఉత్పన్నమైంది. సౌదీ అరేబియాలో జీతం ఆధారంగా మద్యం కొనుగోలు నిబంధనలు సడలించారు. అయితే దుకాణంలో మద్యం కొనేందుకు దరఖాస్తుదారులు తమ జీతం వివరాలు చూపించాల్సి ఉంటుంది.
సౌదీ అరేబియాలోని అనేక మంది విదేశీయులు ఇచ్చిన సమాచారం ప్రకారం, ప్రభుత్వం పాత నిషేధాలను నెమ్మదిగా సడలించింది. నెలకు కనీసం 50,000 రియాల్స్ (సుమారు 13,300 డాలర్లు లేదా రూ.11 లక్షలు) జీతం సంపాదించే నాన్-ముస్లిం విదేశీయులు మాత్రమే రియాద్‌లోని ఏకైక ప్రభుత్వ అధీకృత మద్యం దుకాణం నుంచి మద్యం కొనుగోలు చేయవచ్చు.
ఇంతకు ముందు కేవలం ప్రీమియం వీసాలు ఉన్నవారు లేదా దౌత్యవేత్తలు మాత్రమే సౌదీలో మద్యం కొనుగోలు చేయడానికి అనుమతి ఉండేది. సౌదీ అరేబియాలో 1952 నుంచి మద్యంపై నిషేధం అమల్లో ఉంది. సరిగ్గా రెండేళ్ల క్రితం జనవరి 2024లో రాజధాని రియాద్‌లోని దౌత్య ప్రాంతంలో విదేశీ దౌత్యవేత్తల కోసం మొదటి అధికారిక మద్యం దుకాణం తెరవబడింది. ఇది దేశంలో తొలి, ఏకైక చట్టబద్ధమైన మద్యం విక్రయ కేంద్రం. ఇప్పుడు ఆ రెండేళ్ల తర్వాత సాధారణ నాన్-ముస్లిం విదేశీయులకు కూడా ఈ దుకాణం నుంచి మద్యం కొనుగోలు చేసేందుకు అనుమతి లభించింది.
ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ మార్పులు దేశం అనుసరిస్తున్న ఆర్థిక, సామాజిక సంస్కరణలలో భాగమని స్పష్టమవుతోంది. విదేశీ కార్మికులు, పెట్టుబడిదారులు, పర్యాటకులను ఆకర్షించడానికి విజన్ 2030 లక్ష్యాలను చేరుకోవడానికి ఈ చర్యలు సహాయపడతాయి. అదేవిధంగా రియాద్‌తో పాటు సౌదీ అరేబియాలోని ఇతర ప్రధాన నగరాలైన జెడ్డా, ధహ్రాన్ లలో కూడా 2026 నాటికి మద్యం దుకాణాలు తెరవడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నిబంధనలు సడలించబడిన తర్వాత డిమాండ్ బాగా పెరిగింది. ఈ సడలింపు తర్వాత ప్రీమియం వీసా ఉన్న 12,500 మందికి పైగా విదేశీయులు ఇప్పటికే రియాద్ దుకాణం నుండి మద్యం కొనుగోలు చేశారు.

