Personal Loan: పండుగ సీజన్ రాగానే మార్కెట్లో సందడి మొదలవుతుంది. ఇంటి అవసరాల నుంచి ప్రయాణాలు, కొత్త వస్తువుల కొనుగోళ్ల వరకు ప్రతి ఒక్కరూ భారీగా ఖర్చు చేస్తుంటారు. కొందరు తమ పొదుపు డబ్బులు వాడితే, మరికొందరు తక్షణ ఆర్థిక అవసరాల కోసం ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్లపై ఆధారపడుతున్నారు. తాజాగా పైసాబజార్ విడుదల చేసిన నివేదికలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఈసారి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా పర్సనల్ లోన్ల జారీ ఏకంగా 32 శాతం పెరిగింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో దేశంలోని 800కు పైగా నగరాలు, పట్టణాల గణాంకాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు.

ఈ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికంగా లోన్ల జారీ

దేశవ్యాప్తంగా జారీ అయిన మొత్తం ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్లలో మూడింట ఒక వంతుకు పైగా వాటా కేవలం మూడు రాష్ట్రాల నుంచే వచ్చింది. ఈ జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవగా, ఇక్కడ రుణాల వృద్ధి వార్షిక ప్రాతిపదికన 31 శాతం పెరిగింది. రెండో స్థానంలో నిలిచిన గుజరాత్‌లో ఏకంగా 57 శాతం వృద్ధి నమోదైంది. మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్ (40 శాతం వృద్ధి) నిలిచింది. ఇక టాప్-10 రాష్ట్రాల జాబితాలో నాలుగో స్థానంలో తెలంగాణ, ఐదో స్థానంలో తమిళనాడు ఉండగా, ఆ తర్వాత వరుసగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి.

కుర్రాళ్లతో పోటీపడి లోన్లు తీసుకున్న 46-55 ఏళ్ల వారు

ఈ నివేదికలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం వయసుల వారీగా రుణాల డిమాండ్. సాధారణంగా యువత మాత్రమే ఆన్‌లైన్ లోన్లకు మొగ్గు చూపుతారని అనుకుంటారు. కానీ ఈసారి 46 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో పర్సనల్ లోన్ల డిమాండ్ గతేడాదితో పోలిస్తే ఏకంగా 70 శాతం పెరిగింది. 2025లో మొత్తం రుణాల్లో వీరి వాటా 13 శాతం ఉండగా, 2026లో 19 శాతానికి చేరింది. ఇక 36 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారు 40 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచారు. 25 నుంచి 35 ఏళ్ల యువత వాటా 36 శాతంగా నమోదైంది.

కేవలం 2 గంటల్లోనే రూ.7 లక్షల వరకు లోన్

పైసాబజార్ వివరాల ప్రకారం అర్హులైన కస్టమర్లు తమ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.7 లక్షల వరకు ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ పొందవచ్చు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అంతా పూర్తిగా డిజిటల్ పద్ధతిలో ఉంటుంది. వినియోగదారులు ముందుగా తమ వ్యక్తిగత, ఆదాయ వివరాలను నమోదు చేసి, అందుబాటులో ఉన్న ఆఫర్లను ఎంచుకోవాలి. ఆ తర్వాత వీడియో కేవైసీ పూర్తి చేస్తే సరిపోతుంది. బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ ఆమోదం తెలిపిన తర్వాత కొందరు కస్టమర్ల ఖాతాల్లో కేవలం 2 గంటల్లోనే డబ్బు జమ అవుతుంది.

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో సులభమైన రుణ ప్రక్రియ

డిజిటల్ వేదికల వల్ల సామాన్యులకు రుణాలు పొందడం ఎంతో సులభతరంగా మారిందని పైసాబజార్ సీఈఓ సంతోష్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం తమ ప్లాట్‌ఫామ్‌పై 6 ప్రధాన బ్యాంకులతో సహా మొత్తం 18 రుణ సంస్థలు ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ సేవలను అందిస్తున్నాయని ఆయన వివరించారు. పారదర్శకత, వేగవంతమైన ప్రాసెసింగ్ కారణంగానే పండుగ వేళ ప్రజలు ఇన్‌స్టంట్ లోన్ల వైపు ఎక్కువగా ఆకర్షితులయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story