ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన

NPS : కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఎన్పీఎస్ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఇది మంచి లాభాలను ఇస్తుందని హామీ ఇచ్చింది. అయితే, కొందరు నేషనల్ పెన్షన్ స్కీమ్‌తో పెద్దగా ఉపయోగం ఉండదని అనుకున్నారు. కానీ, వారి అంచనాలు తప్పని నిరూపితం అయింది. తాజాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్పీఎస్ ద్వారా ఏకంగా 13 శాతం వార్షిక రిటర్న్‌లు వచ్చాయని ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ఎన్పీఎస్ దివస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్పీఎస్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడి పథకాల్లో ఒకటిగా అభివర్ణించారు. అంతేకాదు, ప్రభుత్వ సెక్యూరిటీలు, డెట్ బాండ్‌లు కూడా 9 శాతం వార్షిక రిటర్న్‌లను అందించాయని నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు.

నేషనల్ పెన్షన్ స్కీమ్ మొదట 2004లో ప్రారంభమైంది. మొదట్లో దీనిని రైల్వే ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2009 నుండి దీనిని అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు ఉద్యోగులు మాత్రమే కాకుండా, ఎవరైనా సరే ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. 10 నుండి 15 సంవత్సరాల పాటు ఏకంగా 13 శాతం వార్షిక రిటర్న్‌లు ఇవ్వడం సాధారణ విషయం కాదు. ఇది ఒక దీర్ఘకాలిక పెట్టుబడి పథకంగా దాని సామర్థ్యాన్ని చాటుతోంది.

భారతదేశ షేరు మార్కెట్ గత 10 సంవత్సరాలలో మొత్తం మీద 11.76% CAGR (Compound Annual Growth Rate)తో రిటర్న్‌లు ఇచ్చింది. నిఫ్టీ 50 ఇండెక్స్ 2015 అక్టోబర్ మొదటి వారంలో 8,189 పాయింట్ల వద్ద ఉండగా అక్టోబర్ 3న.. 24,894 పాయింట్ల వద్ద ఉంది. ఇది వార్షికంగా 11.76% రేటుతో పెరిగింది. మ్యూచువల్ ఫండ్‌లు గత 10 సంవత్సరాలలో సగటున 10 నుండి 12 శాతం రిటర్న్‌లను అందించాయి.

ఈ నేపథ్యంలో ఎన్పీఎస్ పథకం 13 శాతం వార్షిక రిటర్న్‌లను అందించడం నిజంగా గుర్తించదగిన విషయం. అంటే, మ్యూచువల్ ఫండ్‌ల సగటు కంటే ఎన్పీఎస్ ఎక్కువ లాభాలను ఇచ్చిందని స్పష్టమవుతోంది.

ఎన్పీఎస్ లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో నడిచే పెన్షన్ పథకం. 18 సంవత్సరాలు పైబడిన ఎవరైనా ఎన్పీఎస్ ఖాతాను తెరవవచ్చు. పదవీ విరమణ చేసే వరకు ఇందులో నెలవారీగా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో జమ చేసిన నిధులను మార్కెట్‌లో పెట్టుబడి పెడతారు. పెట్టుబడిదారులకు వివిధ రకాల పెట్టుబడి ఎంపికలు కూడా అందుబాటులో ఉంటాయి, వారి రిస్క్ ప్రొఫైల్, లక్ష్యాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. పదవీ విరమణ తర్వాత, ఎన్పీఎస్ కార్పస్‌లో ఉన్న డబ్బులో 40 శాతం వరకు యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయడానికి ఉపయోగించాలి. మిగిలిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎన్పీఎస్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి, ఇది పెట్టుబడిదారులకు అదనపు లాభం. వృద్ధాప్యంలో జీవితానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు ఎన్పీఎస్ ఒక మంచి ఎంపికగా నిరూపితమైంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story