New NPS Rules : ప్రభుత్వ ఉద్యోగంలో చేరే ప్రతి ఒక్కరి కల రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతమైన జీవితం గడపడం. పెన్షన్ విషయంలో ఉద్యోగుల్లో ఉన్న సందిగ్ధతను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా NPS రూల్స్ 2026ను విడుదల చేసింది. 2004 జనవరి 1 తర్వాత సర్వీసులో చేరిన వారికి ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. దీనివల్ల పెన్షన్ లెక్కలు మారడమే కాకుండా, ప్రభుత్వ అలసత్వం వల్ల ఉద్యోగికి నష్టం కలగకుండా కొత్త భద్రతా ప్రమాణాలు కూడా తోడయ్యాయి.

పెన్షన్ వాటా - ఎవరిది ఎంత?

కొత్త నిబంధనల ప్రకారం.. పెన్షన్ విరాళం అనేది ఉద్యోగి బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రతి నెలా ఉద్యోగి జీతం (బేసిక్ + డీఏ) నుంచి 10 శాతం మొత్తాన్ని ఎన్‌పీఎస్ ఖాతాకు మళ్లిస్తారు. దీనికి అదనంగా ప్రభుత్వం తన వంతుగా 14 శాతాన్ని జమ చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చే ఈ 14 శాతం వాటా ఉద్యోగి భవిష్యత్తులో భారీ పెన్షన్ ఫండ్‌ను కూడబెట్టుకోవడానికి కీలకమవుతుంది. దీర్ఘకాలంలో ఈ పెట్టుబడి కాంపౌండింగ్ పద్ధతిలో పెరిగి రిటైర్మెంట్ సమయానికి పెద్ద మొత్తంగా మారుతుంది.

ఆలస్యమైతే వడ్డీ గ్యారెంటీ

గతంలో పరిపాలనా పరమైన జాప్యం వల్ల ఉద్యోగి పెన్షన్ డబ్బులు సకాలంలో ఖాతాలో పడేవి కావు. దీనివల్ల మార్కెట్ రిటర్న్స్ కోల్పోయి ఉద్యోగులు నష్టపోయేవారు. కానీ 2026 రూల్స్ ఈ సమస్యకు చెక్ పెట్టాయి. ఒకవేళ ప్రభుత్వ కార్యాలయాల ఆలస్యం వల్ల మీ పెన్షన్ డబ్బులు డిపాజిట్ కాకపోతే, ఆ కాలానికి సంబంధించిన పూర్తి వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. సిస్టమ్ చేసే తప్పులకు ఉద్యోగి నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ నిబంధన తెచ్చారు.

PRAN కోసం వెయిటింగ్ లేదు

కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య (PRAN) రావడానికి గతంలో చాలా నెలలు పట్టేది. ఫలితంగా మొదటి కొన్ని నెలల పెట్టుబడి ఆగిపోయేది. ఇప్పుడు ఆ ప్రక్రియను ఫాస్ట్ ట్రాక్ చేశారు. ఉద్యోగి విధుల్లో చేరిన వెంటనే ఎన్‌పీఎస్ ఖాతా ప్రక్రియ మొదలవుతుంది. నిర్ణీత గడువులోగా ప్రాన్ నెంబర్ కేటాయిస్తారు. తద్వారా కెరీర్ ప్రారంభం నుంచే పెన్షన్ పొదుపు మొదలవుతుంది.

రిటైర్మెంట్ రోజున చేతికి ఎంత వస్తుంది?

ఒక ఉద్యోగి తన 30-35 ఏళ్ల సర్వీసులో జమ చేసిన మొత్తం, దానిపై వచ్చిన మార్కెట్ లాభాలు కలిసి పెన్షన్ వెల్త్‎గా మారుతాయి. రిటైర్మెంట్ సమయంలో ఈ మొత్తం నుంచి కొంత భాగాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని తప్పనిసరిగా యాన్యుటీలో పెట్టుబడి పెట్టాలి. ఈ యాన్యుటీ పెట్టుబడే ఉద్యోగికి జీవితాంతం నెలనెలా పెన్షన్ రూపంలో ఆదాయాన్ని అందిస్తుంది. మీ ఖాతాలో ఎంత ఎక్కువ డబ్బు ఉంటే, రిటైర్మెంట్ తర్వాత అంత ఎక్కువ పెన్షన్ వస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story