NPS : జీవితాంతం కష్టపడి, వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందని నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో డబ్బులు దాచుకుంటారు. కానీ తీరా రిటైర్మెంట్ అయ్యాక ఆ డబ్బు చేతికి అందక ఇబ్బంది పడుతున్న వారు ఎందరో ఉన్నారు. ఇలా డబ్బులు ఆగిపోవడానికి కారణం ఇన్వెస్ట్‌మెంట్ లోపాలు కాదు, మనం చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలేనని నిపుణులు చెబుతున్నారు. పత్రాలు సరిగ్గా లేకపోవడం, కేవైసీ అప్‌డేట్ చేయకపోవడం వల్ల వేల కోట్ల రూపాయలు అన్‌క్లెయిమ్డ్ ఫండ్స్‎గా ఎన్‌పీఎస్ ఖాతాల్లోనే ఉండిపోతున్నాయి.

అన్‌క్లెయిమ్డ్ ఎన్‌పీఎస్ ఫండ్ అంటే ఏమిటి?

మీ ఎన్‌పీఎస్ ఖాతాలో డబ్బులు ఉండి, సరైన వ్యక్తికి అందకపోయినా లేదా విత్‌డ్రా ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయినా దానిని అన్‌క్లెయిమ్డ్ ఫండ్ అంటారు. అంటే మీ డబ్బు ఎక్కడికీ పోలేదు, కానీ మీ చేతికి అందడం లేదన్నమాట. రిటైర్మెంట్ తర్వాత ఎగ్జిట్ ప్రాసెస్ మొదలుపెట్టకపోవడం, PRAN నంబర్ పోగొట్టుకోవడం లేదా ఖాతాదారుడు మరణించిన తర్వాత ఆ వివరాలు కుటుంబ సభ్యులకు తెలియకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుంది.

డబ్బులు ఎందుకు ఆగిపోతాయి?

చాలా మంది ఉద్యోగంలో చేరినప్పుడు నామినీ వివరాలు ఇస్తారు. పెళ్లయ్యాక లేదా కుటుంబంలో మార్పులు వచ్చాక ఆ వివరాలను అప్‌డేట్ చేయడం మర్చిపోతారు. అలాగే ఆధార్, పాన్ కార్డుల్లో ఉన్న పేరు, పుట్టిన తేదీలు బ్యాంకు రికార్డులతో సరిపోకపోయినా కేవైసీ తిరస్కరణకు గురై డబ్బులు ఆగిపోతాయి. కేవలం పన్ను ఆదా కోసం ఎన్‌పీఎస్ ఖాతా తెరిచి, ఆ తర్వాత దానిని పట్టించుకోకపోవడం వల్ల కూడా చాలా మంది తమ నిధులను కోల్పోతున్నారు. విత్‌డ్రా ఫారమ్ నింపి, అవసరమైన పత్రాలు జత చేయకుండా వదిలేయడం కూడా పెద్ద పొరపాటే.

ఆగిపోయిన డబ్బును తిరిగి పొందడం ఎలా?

ఒకవేళ మీ ఎన్‌పీఎస్ డబ్బు ఆగిపోతే ఆందోళన చెందక్కర్లేదు. ముందుగా మీ PRAN నంబర్ ద్వారా ఖాతా యాక్టివ్‌గా ఉందో లేదో చూసుకోవాలి. మీ కేవైసీ, బ్యాంకు వివరాలను వెంటనే అప్‌డేట్ చేయాలి. ఖాతాదారుడు మరణించిన పక్షంలో నామినీలు డెత్ సర్టిఫికేట్, ఐడీ కార్డులు, బ్యాంకు వివరాలు సమర్పించి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా లేదా సంబంధిత పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ సెంటర్లకు వెళ్లి విత్‌డ్రా ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

ఎన్‌పీఎస్ వంటి దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఇంట్లో భార్య పిల్లలకు ఖచ్చితంగా తెలియజేయాలి. మీ PRAN నంబర్, లాగిన్ వివరాలు వారికి తెలిసేలా ఒక చోట రాసి ఉంచడం మంచిది. మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచాలి. మీ రికార్డులు అప్‌డేట్ గా ఉంటేనే రిటైర్మెంట్ తర్వాత మీ డబ్బు మీకు సులభంగా అందుతుంది. గుర్తుంచుకోండి, ఆగిపోయిన డబ్బుపై కూడా మార్కెట్ ప్రకారం రిటర్న్స్ వస్తాయి, కానీ ఆ ప్రక్రియను పూర్తి చేయడం మీ బాధ్యత.

PolitEnt Media

PolitEnt Media

Next Story