Jensen Huang: ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన ఎన్విడియాలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. కాలిఫోర్నియాలోని శాంటా క్లారా ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉద్యోగులతో జెన్సన్ హువాంగ్ దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. సోమవారం సీఈవోగా తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితంలో జరిగిన తప్పుల గురించి బహిరంగంగా ప్రస్తావించారు. తన వల్ల భార్య లారీ, పిల్లలు బాధపడ్డారని అంగీకరించారు. తన ప్రవర్తనతో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల మనసులు కూడా నొచ్చుకున్నాయని చెప్పారు. ప్రస్తుతం తాను థెరపీ తీసుకుంటున్నానని వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలను అమెరికా మీడియా సంస్థలు తమ కథనాల్లో వెల్లడించాయి.

కంపెనీ నిబంధనలు ఉల్లంఘించానని ఒప్పుకున్న టెక్ దిగ్గజం

ఎన్విడియా సంస్థను మూడు దశాబ్దాల క్రితం స్థాపించిన జెన్సన్ హువాంగ్.. ఉద్యోగులతో సమావేశంలో మరో కీలక విషయాన్ని అంగీకరించారు. కంపెనీ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలను తానే ఉల్లంఘించినట్లు తెలిపారు. ఆ నిబంధనలను రూపొందించడంలో తనకూ పాత్ర ఉందని, అలాంటప్పుడు వాటిని తానే పాటించకపోవడం తప్పేనని పేర్కొన్నారు. తన ప్రవర్తన సమర్థించదగినది కాదని ఉద్యోగులకు వివరించారు. కాగా, నవంబర్ 11న ఆయన సీఈవో పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు, ఇద్దరు మహిళలతో సంబంధాలపై వచ్చిన ఆరోపణలు ఈ పరిణామాలకు కారణమని అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. వారిలో ఒకరు ఎన్విడియాలో పనిచేసే ఉద్యోగి కాగా, మరొకరు ఆ కంపెనీకి చెందిన కస్టమర్ సంస్థలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నట్లు కథనాలు వెల్లడించాయి. రెండో మహిళపై చైనా నిఘా సంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు అమెరికా అధికారులకు ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇవి ఆరోపణలు, అనుమానాలు మాత్రమే.

హువాంగ్ రీఎంట్రీ వెనుక ట్రంప్ పాత్ర ఉందా?

జెన్సన్ హువాంగ్ తిరిగి సీఈవోగా బాధ్యతలు చేపట్టడం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్ర ఉందనే చర్చ కూడా మొదలైంది. అయితే ఉద్యోగులతో సమావేశంలో హువాంగ్ ఈ ప్రచారాన్ని ఖండించినట్లు సమాచారం. కంపెనీ డైరెక్టర్ల బోర్డు అన్ని విషయాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుందని వివరించారు. మరోవైపు, అమెరికా ప్రభుత్వ వర్గాలు కూడా ఆయన వల్ల జాతీయ భద్రతకు ముప్పు లేదని బోర్డుకు భరోసా ఇచ్చినట్లు వెల్లడైంది. అయితే ట్రంప్ స్వయంగా ఈ వ్యవహారంపై స్పందించడం ఆసక్తికరంగా మారింది. CNBCతో మాట్లాడిన ఆయన.. హువాంగ్ తిరిగి రావాలనే విషయంలో ఎన్విడియా బోర్డు సభ్యులతో మాట్లాడినట్లు చెప్పారు. వారిని ఒప్పించానని వెల్లడించారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. అమెరికా ప్రభుత్వం ఎన్విడియాకు కొన్ని కీలక నిఘా సమాచారాన్ని అందించిందని, బోర్డు నిర్ణయంపై ఇది ప్రభావం చూపిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇకపై హువాంగ్ ప్రవర్తనపై బోర్డు నిఘా

సీఈవోగా తిరిగి వచ్చినప్పటికీ జెన్సన్ హువాంగ్‌కు ఇకపై గతంలో ఉన్నంత స్వేచ్ఛ ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రవర్తనను ఇకపై కంపెనీ బోర్డు నేరుగా పర్యవేక్షించనుంది. హువాంగ్‌కు నేరుగా రిపోర్ట్ చేసే ఉన్నతాధికారులు ఆయన ప్రవర్తనకు సంబంధించిన వివరాలను బోర్డుకు తెలియజేయాల్సి ఉంటుందని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. మరోవైపు, తనను కఠినంగా వ్యవహరించే బాస్‌గా చిత్రీకరిస్తున్న వార్తలను హువాంగ్ ఖండించారు. కంపెనీలో తన ఆధిపత్యం ఎక్కువైందనే విమర్శలను కూడా ఆయన తోసిపుచ్చినట్లు సమాచారం.

Next Story