Jensen Huang: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రస్థానానికి దూసుకెళ్తున్న ఎన్విడియా సంస్థకు ఇప్పుడు పెద్ద చిక్కులు వచ్చిపడ్డాయి. ఆ సంస్థ సీఈఓ జెన్సన్ హువాంగ్ ఒక చైనా స్పైతో సంబంధం కలిగి ఉన్నారనే వార్తలు అమెరికా రాజకీయాల్లో కలకలం రేపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం చైనాకు ఎగుమతి చేసే కంపెనీల నిబంధనలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాల అసలు దెబ్బ అమెరికా కంటే ఎక్కువగా చైనా ఏఐ ఇండస్ట్రీ పైనే పడనుంది. డ్రాగన్ దేశం తన ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయడానికి ఎన్విడియా చిప్స్‌పై భారీగా ఆధారపడుతుండటమే ఇందుకు ప్రధాన కారణం.

చైనా ఏఐ కంపెనీలకు ఎన్విడియా చిప్స్ ఎందుకు ?

ఏఐ మోడళ్లను తయారు చేయాలంటే అత్యంత పవర్ఫుల్ కంప్యూటర్ చిప్స్ అత్యవసరం. ప్రపంచవ్యాప్తంగా ఈ అవసరాన్ని తీర్చడంలో ఎన్విడియాకు చెందిన జీపీయూ చిప్స్ ముందున్నాయి. చైనాకు చెందిన అలీబాబా, బైట్‌డ్యాన్స్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు సైతం భారీ స్థాయిలో కంప్యూటింగ్ శక్తిని కోరుకుంటున్నాయి. అమెరికా ఇప్పటికే చైనాకు అత్యంత శక్తివంతమైన ఎన్విడియా చిప్స్ అమ్మకుండా నిషేధం విధించింది. అయినప్పటికీ చైనా కంపెనీలు ఇతర దేశాల డేటా సెంటర్లు అలాగే వేరే మార్గాల ద్వారా ఎన్విడియా సేవలను రహస్యంగా వాడుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ దారులన్నీ మూసుకుపోయే ప్రమాదం ఏర్పడింది.

సింగపూర్ సంస్థ ద్వారా చిప్స్ చేరడంపై అనుమానాలు

సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ద్వారా సుమారు 7.5 బిలియన్ డాలర్ల విలువైన ఎన్విడియా చిప్స్ చైనా కంపెనీలకు చేరాయనే ఆరోపణలు వచ్చాయి. సంబంధిత వర్గాలు ఈ వాదనలను ఖండించినప్పటికీ, అమెరికా అధికారుల్లో మాత్రం అనుమానాలు బలపడ్డాయి. చైనా వరకు చిప్స్ చేరే అన్ని అక్రమ మార్గాలను పూర్తిగా బంద్ చేయాలని అమెరికా చట్టసభ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ వాషింగ్టన్ ప్రభుత్వం ఈ దిశగా కఠిన నిర్ణయాలు తీసుకుంటే, చైనా టెక్ కంపెనీలకు అత్యాధునిక ఏఐ టెక్నాలజీ అందడం మరింత కష్టమవుతుంది.

హువావే సంస్థపై ఒత్తిడి

చైనా తన స్వంత దేశంలో చిప్ తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి హువావే వంటి సంస్థల ద్వారా ప్రయత్నిస్తున్నప్పటికీ, స్థానిక డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తిని అందించలేకపోతోంది. ఎన్విడియా సరఫరా పూర్తిగా నిలిచిపోతే చైనా ఏఐ కంపెనీలకు వెంటనే తగిన ప్రత్యామ్నాయాలు దొరకవు. దీనివల్ల కొత్త ఏఐ ప్రాజెక్ట్‌ల వేగం మందగించడమే కాకుండా నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అమెరికా ఆంక్షల వల్ల చైనా తన స్వంత టెక్నాలజీని వేగంగా అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక రకంగా ప్రేరణగా మారినప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం ఆ దేశ ఏఐ రంగానికి తీవ్ర నిరాశే మిగులుతుంది.

Next Story