అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

New Rules from October 1 : రాబోయే నెల అక్టోబర్ 1, 2025 నుండి కొన్ని కీలకమైన మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు సామాన్య ప్రజల రోజువారీ జీవితం , ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నాయి. ప్రతినెల మొదటి తేదీన ఎల్‌పీజీ సిలిండర్ ధరల సవరణతో పాటు, ఇండియన్ రైల్వేస్ టిక్కెట్ల బుకింగ్, యూపీఐ లావాదేవీలు, ఆర్‌బీఐ రెపో రేటుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు ఈ అక్టోబర్ నెలలోనే వెలువడనున్నాయి. ఈ మార్పుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

1. ఆర్‌బీఐ రెపో రేటు సవరణ

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ సాధారణంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఆగస్టులో MPC సమావేశం జరిగిన తర్వాత, ఇప్పుడు సెప్టెంబర్ 29న ప్రారంభమై మూడు రోజుల పాటు సమావేశం జరగనుంది. ఈ సమావేశం నిర్ణయాలను అక్టోబర్ 1న అధికారికంగా ప్రకటిస్తారు. ఈ సమావేశంలో రెపో రేటుతో సహా అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. గత ఫిబ్రవరి నుండి రెపో రేటు నిరంతరం తగ్గుతూ వస్తోంది. ఈసారి కూడా రెపో రేటు తగ్గుతుందా అనేది అక్టోబర్ 1న స్పష్టమవుతుంది. ఎస్‌బీఐ రీసెర్చ్ బృందం ఈసారి 25 బేసిస్ పాయింట్ల (0.25%) రేటు కోత ఉండవచ్చని అంచనా వేయగా, మరికొందరు ఆర్థిక నిపుణులు రేటు కోత వచ్చే అవకాశం తక్కువ అని వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, రెపో రేటు లేదా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం మాత్రం ప్రస్తుతానికి లేదు.

2. యూపీఐలో పెద్ద మార్పు

భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించబడుతున్న డిజిటల్ చెల్లింపుల పద్ధతి అయిన యూపీఐలో కూడా ఒక ముఖ్యమైన నియమ మార్పు అక్టోబర్‌లో రానుంది. ఈ మార్పు యూపీఐ P2P (పీర్-టు-పీర్) సేవలకు సంబంధించినది. దీని ప్రకారం కలెక్ట్ రిక్వెస్ట్ ఫీచర్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిలిపివేయనున్నట్లు సమాచారం. ‘కలెక్ట్ రిక్వెస్ట్’ అనేది ఒక యూపీఐ వినియోగదారుడు మరొక యూపీఐ వినియోగదారుడికి డబ్బు కోసం అభ్యర్థన పంపే పద్ధతి. అయితే, ఈ పద్ధతిని ఉపయోగించి కొందరు మోసాలకు పాల్పడుతున్నందున, మోసాలను నివారించడానికి NPCI ఈ ఫీచర్‌ను పూర్తిగా తొలగించే అవకాశం ఉంది. ఇది యూపీఐ లావాదేవీల సేఫ్టీని మరింత పెంచుతుంది.

3. రైలు టికెట్ బుకింగ్‌లో మార్పులు

అక్టోబర్ 1 నుండి రైల్వే టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఈ నిబంధన ప్రకారం, ఆధార్ ధృవీకరించబడిన ప్రయాణీకులకు రైల్వే ప్రాధాన్యత ఇవ్వనుంది. అలాంటి ప్రయాణీకులకు రైలు టిక్కెట్ బుకింగ్ ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. అంటే, సాధారణ ప్రయాణీకులు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి 15 నిమిషాలు వేచి ఉండాల్సి ఉంటుంది, ఆధార్ ధృవీకరించబడిన వారు మాత్రం ముందుగానే తమ టిక్కెట్లను ఖరారు చేసుకోవచ్చు. ఇది తత్కాల్ టికెట్ బుకింగ్ లేదా అధిక డిమాండ్ ఉన్న రూట్లలో ప్రయాణించే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

4. ఎల్‌పీజీ ధరలలో మార్పులు:

ప్రతి నెల మొదటి రోజున గ్యాస్ ఏజెన్సీలు ఎల్‌పీజీ సిలిండర్ ధరలను సవరిస్తాయి. గృహ వినియోగ మరియు వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ల ధరలను ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ ఏజెన్సీలు సమీక్షించి, కొత్త ధరలను ప్రకటిస్తాయి. ఇది పెట్రోలియం ఉత్పత్తుల అంతర్జాతీయ ధరలు, భారత రూపాయి-డాలర్ మారకం రేటుపై ఆధారపడి ఉంటుంది. అక్టోబర్ 1న కూడా ఎల్‌పీజీ ధరలలో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ ధరల మార్పులు నేరుగా సామాన్య ప్రజల నెలవారీ ఖర్చులపై ప్రభావం చూపుతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story