UPI : డిజిటల్ పేమెంట్స్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న యూపీఐ త్వరలోనే మరో విప్లవాత్మక ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. ఇంటర్నెట్ సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు సులువుగా జరిగేలా ట్యాప్-టు-పే టెక్నాలజీని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వేగవంతం చేస్తోంది. విమాన ప్రయాణాలు, అండర్‌గ్రౌండ్ మెట్రో టన్నెళ్లు లేదా నో-నెట్‌వర్క్ జోన్‌లలో ఉన్నప్పుడు కూడా మర్చంట్ల వద్ద ఉండే పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లపై మీ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ట్యాప్ చేయడం ద్వారా సులభంగా డబ్బులు చెల్లించవచ్చు. 2026 నాటికి ఈ ఆఫ్ లైన్ PoS పరికరాలను సర్టిఫై చేసే ప్రక్రియను ఎన్‌పీసీఐ ప్రారంభించనుంది.

ఎలా పనిచేస్తుంది? రూ. 2,000 వరకు లిమిట్

ఈ కొత్త విధానంలో నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) టెక్నాలజీని ఉపయోగిస్తారు. వినియోగదారులు ముందుగానే ఇంటర్నెట్ ఉన్నప్పుడు తమ యూపీఐ లైట్ వాలెట్‌లో డబ్బులు లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉన్నప్పుడు ఎన్‌ఎఫ్‌సీ ఫీచర్ ఉన్న ఫోన్‌ను షాపుల్లోని ఆమోదిత PoS పరికరానికి తాకించడం ద్వారా గరిష్టంగా రూ. 2,000 వరకు పేమెంట్ చేయవచ్చు. దీనికి ఎలాంటి యూపీఐ పిన్ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. నెట్‌వర్క్ తిరిగి రాగానే PoS పరికరం సదరు లావాదేవీని సర్వర్‌కు చేరవేస్తుంది.

పిఓఎస్ కంపెనీలకు ఎన్‌పీసీఐ సర్టిఫికేషన్ తప్పనిసరి

మర్చంట్లు ఈ ఆఫ్‌లైన్ పేమెంట్లను స్వీకరించాలంటే వారు వాడే PoS మిషన్ కంపెనీలు NPCI నుంచి ప్రత్యేక గుర్తింపు పొందాల్సి ఉంటుంది. ఇప్పటివరకు యూపీఐ లైట్ X ద్వారా కేవలం క్యూఆర్ కోడ్‌లు, సౌండ్‌బాక్స్‌ల ద్వారానే ఆఫ్‌లైన్ పేమెంట్లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు సాంప్రదాయ కార్డు స్వైపింగ్ మిషన్లకు ఈ సదుపాయాన్ని విస్తరిస్తున్నారు. థర్డ్ పార్టీ యూపీఐ యాప్‌లు, బ్యాంకులు కూడా తమ యాప్‌లలో ఈ ఎన్‌ఎఫ్‌సీ ట్యాప్ ఫీచర్‌ను అనుసంధానించే పనిలో నిమగ్నమయ్యాయి.

రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు

ప్రస్తుతం ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం ఆఫ్ లైన్ డిజిటల్ ట్రాన్సాక్షన్ పరిమితి ప్రతి లావాదేవీకి రూ.500గా ఉంది. అయితే ప్రతిపాదిత ఈ కొత్త ఆఫ్ లైన్ PoS విధానంలో రూ. 2,000 వరకు అనుమతించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆర్బీఐ ప్రస్తుత నిబంధనలకు, ఈ కొత్త విధానానికి మధ్య ఉన్న వ్యత్యాసాలపై ఎన్‌పీసీఐ త్వరలోనే పూర్తిస్థాయి మార్గదర్శకాలను విడుదల చేయనుంది. జూన్ 2026 నాటికి నెలకు ఏకంగా 2,272 కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదైన తరుణంలో, ఈ ఆఫ్‌లైన్ ట్యాప్ ఫీచర్ రాకతో డిజిటల్ చెల్లింపుల వినియోగం మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story