Crude Oil : రష్యా ఆయిల్‌కు భారత్ గుడ్ బై..మళ్లీ అరబ్ దేశాల వైపు మొగ్గు చూపుతున్న రిఫైనరీలు
మళ్లీ అరబ్ దేశాల వైపు మొగ్గు చూపుతున్న రిఫైనరీలు

Crude Oil : ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుంచి తక్కువ ధరకే ముడి చమురు లభించడంతో భారత్ రికార్డు స్థాయిలో దిగుమతులు చేసుకుంది. ఒక దశలో రష్యానే భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. అయితే రష్యా నుంచి చమురు కొనడం వల్ల వచ్చే ఆదాయాన్ని ఆ దేశం యుద్ధం కోసం వాడుతోందని అమెరికా, ఐరోపా దేశాలు భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనికి తోడు భారత్‌తో ఉన్న వాణిజ్య లోటును తగ్గించుకోవాలని అమెరికా భావిస్తోంది. అందుకే గతేడాది భారతీయ వస్తువులపై దిగుమతి సుంకాలను ఏకంగా 50 శాతానికి పెంచింది. ఈ ఒత్తిడిని తగ్గించుకునేందుకు భారత్ ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గిస్తోంది.
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. భారత ప్రభుత్వ రంగ రిఫైనరీ కంపెనీలు ఇప్పుడు మధ్య ప్రాచ్య దేశాలైన ఇరాక్, ఒమన్, యూఏఈ నుంచి చమురు కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. దేశంలోని ప్రముఖ చమురు సంస్థ భారత్ పెట్రోలియం(BPCL) ఇప్పటికే ఒమన్, ఇరాక్ నుంచి చమురు కోసం ఏడాది కాలానికి టెండర్లు పిలిచింది. దుబాయ్ రేటు కంటే తక్కువకే చమురు సరఫరా చేసేలా ట్రాఫిగురా వంటి అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. గతేడాది డిసెంబర్‌లో రష్యా నుంచి చమురు దిగుమతులు గత రెండేళ్లలో లేనంత తక్కువ స్థాయికి పడిపోవడం గమనార్హం.
మరోవైపు, అమెరికాను ప్రసన్నం చేసుకునేందుకు భారత్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇప్పుడు ప్రతి వారం ఒక ప్రత్యేక నివేదికను తయారు చేస్తోంది. ఇందులో రష్యా నుంచి ఎంత చమురు కొంటున్నాం, అమెరికా నుంచి ఎంత దిగుమతి చేసుకుంటున్నాం అనే లెక్కలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే హెచ్‌పీసీఎల్, మంగళూరు రిఫైనరీ వంటి సంస్థలు రష్యా నుంచి దిగుమతులను నిలిపివేశాయి. దీనివల్ల అమెరికాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపడి, భారత వస్తువులపై ఉన్న సుంకాలు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశిస్తోంది.
కేవలం అరబ్ దేశాలే కాకుండా.. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, వెనిజులా వంటి దేశాల నుంచి కూడా చమురు కొనుగోలు చేసే అవకాశాలను భారత్ పరిశీలిస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ముడి చమురు సరఫరా బాగుండటం, ఓపెన్ దేశాలు ఉత్పత్తిని పెంచడం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇలా అన్ని వైపుల నుండి చమురు కొనుగోళ్లను సమతుల్యం చేయడం ద్వారా అంతర్జాతీయ ఒత్తిడిని తగ్గించుకోవడమే కాకుండా, దేశ ఇంధన భద్రతను కాపాడుకోవాలని భారత్ మాస్టర్ ప్లాన్ వేసింది.

