Old vs New Tax Regime: ఐటీఆర్ ఫైలింగ్‌కు ముందే జాగ్రత్త.. పొరపాటున ఈ ట్యాక్స్ ఆప్షన్ ఎంచుకుంటే నష్టపోతారు
పొరపాటున ఈ ట్యాక్స్ ఆప్షన్ ఎంచుకుంటే నష్టపోతారు

Old vs New Tax Regime: ఐటీ రిటర్న్స్ (ITR) దాఖలు చేసే సమయం వచ్చేసింది. ఈ తరుణంలో పన్ను చెల్లింపుదారులందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న.. పాత పన్ను విధానం మేలా? లేక కొత్త పన్ను విధానం మేలా?. ఏ ఆప్షన్ ఎంచుకుంటే ఎక్కువ డబ్బు ఆదా అవుతుందో తెలియక చాలా మంది సందిగ్ధంలో ఉన్నారు. మీ ఆదాయం, పెట్టుబడుల ఆధారంగా ఏది ఎక్కువ డబ్బు ఆదా చేస్తుందో వివరంగా తెలసుకుందాం.
కొత్త పన్ను విధానం
కొత్త పన్ను విధానం ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఇందులో పన్ను రేట్లు తక్కువగా ఉండటమే కాకుండా ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. జీతం తీసుకునే ఉద్యోగులు రూ.12.75 లక్షల వరకు, ఇతర ఆదాయం ఉన్నవారు రూ.12 లక్షల వరకు ఎటువంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఎటువంటి పెట్టుబడులు లేని వారికి, హోమ్ లోన్ లేదా ఎల్ఐసీ లాంటి మినహాయింపులు లేని వారికి ఈ కొత్త పద్ధతి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎటువంటి డాక్యుమెంట్ల గందరగోళం లేకుండా ట్యాక్స్ సేవింగ్ చేసుకోవచ్చని ప్రభుత్వం దీనిని ప్రోత్సహిస్తోంది.
పాత పన్ను విధానం
కేవలం తక్కువ వడ్డీ రేట్లు చూసి కొత్త విధానానికి మొగ్గు చూపడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత పన్ను విధానంలో మీరు పొందే మినహాయింపులు చాలా ఎక్కువ. హౌస్ రెంట్ అలవెన్స్, పిల్లల చదువుల ఖర్చు, ఎల్టీసీ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, సెక్షన్ 80C కింద చేసే పెట్టుబడులు పాత పద్ధతిలో మీ ఆదాయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. మీరు గనక ఎక్కువగా పొదుపు చేస్తూ, బీమా పాలసీలు లేదా పీపీఎఫ్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లయితే.. మీకు పాత పన్ను విధానమే లాభదాయకంగా ఉండవచ్చు.
రెండింటిలోనూ లభించే ఉమ్మడి ప్రయోజనాలు
కొన్ని రకాల పన్ను ప్రయోజనాలు ఇప్పుడు రెండు విధానాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు, ఫుడ్ కూపన్లు గతంలో కేవలం రూ.50 మేరకే ఉండేవి, కానీ ఇప్పుడు వాటిని రూ.200కు పెంచారు. ఇది రెండు పద్ధతుల్లోనూ వర్తిస్తుంది. అలాగే కంపెనీ ఇచ్చే కారు సదుపాయం, రూ.15,000 వరకు అందే బహుమతులు, వోచర్లు కూడా రెండు విధానాల్లో ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించారు. కాబట్టి ఈ సదుపాయాలను వాడుకుంటూ మీ ట్యాక్సబుల్ ఇన్‌కమ్‌ను తగ్గించుకోవచ్చు.
ముగింపు తేదీలు, ఐటీఆర్ డెడ్ లైన్
2026-27 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2027-28) ఐటీఆర్ ఫైల్ చేయడానికి జూలై 31, 2027 చివరి తేదీ. అదేవిధంగా, అసెస్మెంట్ ఇయర్ 2026-27 కి జూలై 31, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. మీరు ఏ విధానాన్ని ఎంచుకున్నా సరే, మీ ఆదాయం, ఖర్చులను ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకోవడం అవసరం. కొత్తది సరళంగా ఉన్నప్పటికీ, పాతది సరైన ప్లానింగ్‌తో ఎక్కువ డబ్బును మీ జేబులో మిగిల్చే అవకాశం ఉంది. అందుకే ఐటీఆర్ ఫైలింగ్‌కు ముందే మీ ఆడిటర్ లేదా ట్యాక్స్ నిపుణుడిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

