Oracle : ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐటీ వంటి కాలేజీల్లో సీటు సంపాదించడం ఎంత కష్టమో.. అక్కడ చదువు పూర్తి చేసి భారీ ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కొట్టడం విద్యార్థులకు అంత పెద్ద కల. అయితే, ఆ కల నిజమైందని సంబరపడేలోపే అమెరికన్ టెక్ దిగ్గజం ఒరాకిల్ ఆశలపై నీళ్లు చల్లింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా ఎంపిక చేసిన విద్యార్థులకు ఇచ్చిన భారీ శాలరీ ఆఫర్లను కంపెనీ అకస్మాత్తుగా రద్దు చేసింది. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడింది.

ఈ ఉదంతంలో విద్యార్థులు ఇంతలా నష్టపోవడానికి ప్రధాన కారణం ఐఐటీ, ఎన్ఐటీల్లో ఉండే ప్లేస్‌మెంట్ రూల్స్. ఐఐటీ రూర్కీ, హైదరాబాద్, వారణాసి నుంచి ఎన్ఐటీ వరంగల్ వరకు చాలా చోట్ల ఒక్క విద్యార్థికి ఒక్క ఉద్యోగం అనే పాలసీ ఉంది. అంటే.. ఒక కంపెనీ ఆఫర్ లెటర్ ఇస్తే, ఆ విద్యార్థి ఇక వేరే కంపెనీ ఇంటర్వ్యూల్లో కూర్చోవడానికి వీల్లేదు. ఒరాకిల్ రూ.35 నుంచి రూ.40 లక్షల ప్యాకేజీ ఆఫర్ చేయడంతో.. విద్యార్థులు మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ వంటి దిగ్గజ కంపెనీల అవకాశాలను వదులుకున్నారు. ఇప్పుడు ఒరాకిల్ తప్పుకోవడంతో వారి చేతిలో మరో ఉద్యోగం లేకుండా పోయింది.

ఉద్యోగంలో చేరడానికి కేవలం నెల రోజుల ముందు ఒరాకిల్ ఈ నిర్ణయం తీసుకోవడం దారుణమని విద్యార్థులు వాపోతున్నారు. ఐఐటీ వారణాసికి చెందిన ఎం.టెక్ విద్యార్థి తాన్సేన్ లహరే, వీఎన్ఐటీ నాగపూర్‌కు చెందిన అనిమేష్ శర్మ వంటి వారు ఇప్పుడు ఉద్యోగం కోసం లింక్డ్ఇన్ వేదికగా అభ్యర్థిస్తున్నారు. కొందరికైతే ఇంటర్న్‌షిప్ తర్వాత ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్లు ఇచ్చి మరీ ఇప్పుడు కుదరదని చేతులెత్తేసింది కంపెనీ. అసలే ఆర్థిక మాంద్యం భయాల మధ్య కొత్త ఉద్యోగం దొరకడం గగనంగా మారిన తరుణంలో ఈ వార్త వారిని కుంగదీస్తోంది.

ఒరాకిల్ తన వ్యాపార నిర్మాణంలో చేస్తున్న భారీ మార్పులే దీనికి కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా ఒరాకిల్ హెల్త్, అప్లికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగాలను మూసివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఈ విభాగాల కోసమే ఐఐటీ విద్యార్థులను భారీ ప్యాకేజీలతో ఎంపిక చేశారు. ఆ విభాగాలే లేనప్పుడు ఉద్యోగాలు ఎలా ఇస్తామని కంపెనీ ప్రశ్నిస్తోంది. ప్రభావితమైన విద్యార్థులను ఇతర టీమ్స్‌లోకి మార్చే ప్రయత్నం చేశామని, కానీ ఖాళీలు లేకపోవడంతో ఆఫర్లను రద్దు చేయాల్సి వచ్చిందని ప్లేస్‌మెంట్ అధికారులకు కంపెనీ వివరణ ఇచ్చింది.

గత నెలలోనే ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో 12,000 మంది ఒక్క భారత్ నుంచే కావడం గమనార్హం. కంపెనీ తన బడ్జెట్‌లో భారీ కోత విధిస్తోందని, అందులో భాగంగానే కొత్తగా చేరాల్సిన విద్యార్థులపై ఈ ప్రభావం పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అగ్రశ్రేణి విద్యాసంస్థల విద్యార్థులకే ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం కార్పొరేట్ ప్రపంచంలో కాస్ట్ కటింగ్ ఎంత దారుణంగా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story