OYO IPO : త్వరలో మార్కెట్లోకి ఓయో ఐపీఓ.. రూ.6,650 కోట్లు సేకరించడమే లక్ష్యం
రూ.6,650 కోట్లు సేకరించడమే లక్ష్యం

OYO IPO : ప్రముఖ హాస్పిటాలిటీ, హోటల్ రంగ దిగ్గజం ఓయో త్వరలోనే భారత షేర్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సర్వం సిద్ధం చేసుకుంది. ఓయో మాతృ సంస్థ అయిన ప్రిజమ్ సుమారు రూ.6,650 కోట్ల భారీ బడ్జెట్‌తో ఐపీఓ తీసుకురాబోతోంది. దీనికి సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించిన తాజా పత్రాల ప్రకారం ఓయోకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ఐపీఓ ద్వారా వచ్చే నిధులను కంపెనీ చాలా తెలివిగా ఉపయోగించుకోనుంది. మార్కెట్లోకి అడుగుపెట్టే ముందే ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగించేలా కంపెనీ తన బ్యాలెన్స్ షీట్‌ను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది.
వచ్చే డబ్బుతో పాత అప్పులు ఖతం
ఈ ఐపీఓ ద్వారా సేకరించే రూ.6,650 కోట్లలో సింహభాగం అంటే దాదాపు 75 శాతం నిధులను (రూ.4,987.5 కోట్లు) ఓయో తన పాత అప్పులను తీర్చడానికే ఉపయోగించనుంది. మిగిలిన నిధులను కంపెనీ రోజువారీ కార్పొరేట్ అవసరాలు, ఇతర వ్యాపార విస్తరణల కోసం పెట్టుబడిగా పెట్టబోతోంది. సాధారణంగా మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఏదైనా ఒక కంపెనీ తన అప్పులను తగ్గించుకుంటే దాని ఆర్థిక స్థిరత్వం క్రమంగా పెరుగుతుంది. లిస్టింగ్ అయిన తర్వాత కూడా స్టాక్ మార్కెట్లో షేర్ ధర స్థిరంగా ఉండటానికి ఓయో తీసుకున్న ఈ నిర్ణయం ఒక ముందస్తు వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు.
పూర్తిగా ఫ్రెస్ ఇష్యూ.. సైజ్ తగ్గే ఛాన్స్
ఓయో తీసుకురాబోతున్న ఈ ఐపీఓ అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఇది పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ రూపంలో వస్తోంది. అంటే ఈ ఐపీఓ ద్వారా కంపెనీ కేవలం కొత్త షేర్లను మాత్రమే మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పాత షేర్‌హోల్డర్లు లేదా ప్రమోటర్లు ఎవరూ కూడా ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా తమ సొంత వాటాలను అమ్ముకోవడం లేదు. అయితే, మార్కెట్ పరిస్థితులను బట్టి ఐపీఓ ఫైనల్ సైజులో కొద్దిగా మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. పబ్లిక్ ఇష్యూ రాకముందే సుమారు రూ.1,330 కోట్ల వరకు ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్ చేయాలని ఓయో భావిస్తోంది. ఒకవేళ ఈ ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్ సక్సెస్ అయితే, మెయిన్ ఐపీఓ సైజును అంత మేర తగ్గిస్తారు.
భారీ లాభాల బాటలో ఓయో ఆర్థిక ఆరోగ్యం
గత కొన్నేళ్లుగా నష్టాల్లో ఉన్న ఓయో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన రికార్డులతో లాభాల బాట పట్టింది. ఆర్థిక సంవత్సరం 2026లోని మొదటి తొమ్మిది నెలల కాలంలో (ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2026 వరకు) ఓయో మాతృ సంస్థ ప్రిజమ్ ఏకంగా రూ.6,941 కోట్ల ఆపరేషనల్ రెవెన్యూను సాధించింది. ఇదే సమయంలో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 11 శాతం పెరిగి రూ.748 కోట్లకు చేరుకుంది. కేవలం ఆపరేటింగ్ లెవెల్‌లోనే కాకుండా.. కంపెనీ EBITDA కూడా గత ఆర్థిక సంవత్సరం 2025 లో రూ.953 కోట్ల నుండి ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి రూ.2,127 కోట్లకు చేరింది. ఈ అద్భుతమైన ఆర్థిక వృద్ధిని చూసాక, ఇన్వెస్టర్లు ఓయో ఐపీఓపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.

