Cryptocurrency : ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ఇప్పుడు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తన కరెన్సీ విలువ రోజురోజుకూ పడిపోతుండటంతో, ఆ లోటును భర్తీ చేయడానికి డిజిటల్ కరెన్సీ వైపు మొగ్గు చూపింది. బిట్‌కాయిన్, ఎథీరియం వంటి క్రిప్టోకరెన్సీలను ఆ దేశం అధికారికంగా గుర్తించింది. ఇన్నాళ్లూ క్రిప్టో అంటేనే ఆమడ దూరం పరిగెత్తిన పాక్.. ఇప్పుడు ఏకంగా వర్చువల్ అసెట్స్ యాక్ట్ 2026 పేరుతో కొత్త చట్టాన్నే తెచ్చింది. దీనివల్ల ఆ దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మారుతుందని అక్కడి ప్రభుత్వం ఆశిస్తోంది.

చారిత్రాత్మక నిర్ణయం

పాకిస్థాన్ స్టేట్ బ్యాంక్ (SBP) ఒక కీలకమైన సర్క్యులర్ జారీ చేస్తూ దేశంలో క్రిప్టోకరెన్సీని చట్టబద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. వర్చువల్ అసెట్స్ యాక్ట్ 2026 ద్వారా డిజిటల్ ఆస్తులను అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగం చేశారు. ఈ నిర్ణయం ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట వేయవచ్చని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. ఇన్నాళ్లూ అక్కడ క్రిప్టో లావాదేవీలు చేసేవారు పోలీసుల భయంతో ఉండేవారు, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.

కొత్త రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు

డిజిటల్ ఆస్తుల లావాదేవీలను పర్యవేక్షించడానికి పాకిస్థాన్ వర్చువల్ అసెట్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేశారు. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. దేశంలో క్రిప్టో ఎక్స్ఛేంజీలు నడపాలన్నా, డిజిటల్ వాలెట్ సేవలు అందించాలన్నా ఈ సంస్థ నుంచి లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. అంతేకాకుండా, లైసెన్స్ పొందిన సంస్థలు పాకిస్థాన్‌లోని సాధారణ బ్యాంకుల్లో అకౌంట్లు తెరుచుకోవడానికి కూడా సెంట్రల్ బ్యాంక్ అనుమతి ఇచ్చింది. అంటే, ఇకపై క్రిప్టో లావాదేవీలు నేరుగా బ్యాంకింగ్ ఛానెల్స్ ద్వారానే జరుగుతాయన్నమాట.

ఎగుమతి, దిగుమతుల్లోనూ క్రిప్టో

కొత్త నిబంధనల ప్రకారం, విదేశాల్లో నివసించే పాకిస్థానీయులు క్రిప్టో ద్వారా డబ్బు పంపవచ్చు. అలాగే ఎగుమతి, దిగుమతి వ్యాపారాలలో కూడా డిజిటల్ కరెన్సీని వినియోగించడానికి అనుమతి ఇచ్చారు. దీనివల్ల డాలర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్‌కు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. ఫిన్‌టెక్ కంపెనీలకు ఇది ఒక గొప్ప వరమని అక్కడి నిపుణులు చెబుతున్నారు.

గతంలో ఉన్న కఠిన నిబంధనలు

గతంలో పాకిస్థాన్ క్రిప్టోకరెన్సీ విషయంలో అత్యంత కఠినంగా ఉండేది. ఎవరైనా బిట్‌కాయిన్ వాడితే జైలు శిక్ష పడుతుందన్న భయం ఉండేది. బ్యాంకులు క్రిప్టో సంస్థలతో ఎటువంటి లావాదేవీలు జరపడానికి వీల్లేదని స్టేట్ బ్యాంక్ ఆదేశాలు ఉండేవి. కానీ ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి దిగజారడం, అంతర్జాతీయంగా డిజిటల్ కరెన్సీకి ప్రాధాన్యత పెరగడంతో పాక్ తన వైఖరిని మార్చుకుంది. ఈ మార్పు వల్ల పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు పుంజుకుంటుందో వేచి చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story