Petrol Price: ఇండిపెండెన్స్ డే వేళ షాక్.. రూ. 325 దాటిన లీటర్ పెట్రోల్.. డీజిల్ ధర వింటే షాకే
డీజిల్ ధర వింటే షాకే

Petrol Price: స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో మునిగితేలాల్సిన వేళ పాకిస్తాన్ పౌరులకు ఘోరమైన ఊహించని షాక్ తగిలింది. దేశంలో ఆర్థిక సంక్షోభం తాండవిస్తున్న వేళ పాక్ ప్రభుత్వం ఇంధన ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 14 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నూతన ధరల ప్రకారం లీటర్ పెట్రోల్‌పై 0.45 పాకిస్తానీ రూపాయి, హైస్పీడ్ డీజిల్‌పై 1.16 పాకిస్తానీ రూపాయల మేర వడ్డించారు. దీంతో పెట్రోల్ ధర లీటరుకు రూ.325.43 కి చేరగా, హైస్పీడ్ డీజిల్ ధర రూ.383.95 కు ఎగబాకింది.
అంతర్జాతీయ ఉద్రిక్తతలు.. పన్నుల వడ్డింపు
ఇరాన్, అమెరికా దేశాల మధ్య రోజురోజుకూ పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా అస్థిరతకు గురవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై ఏకంగా 114 రూపాయలు, డీజిల్‌పై 100 రూపాయల చొప్పున పన్నులు, డ్యూటీల రూపంలో వసూలు చేయడం గమనార్హం. గతంలో ఏప్రిల్ నెలలో ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరిన డీజిల్ ధర రూ.520, పెట్రోల్ ధర రూ.458 నుంచి కొంత తగ్గినప్పటికీ, ప్రస్తుత పెంపు సామాన్యుల నడుము విరుస్తోంది.
ప్రతిరోజూ రేట్ల మార్పునకు కమిటీ ఏర్పాటు
గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని ఇకపై ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరించే బాధ్యతను ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ(ఓగ్రా)కి అప్పగించింది పాక్ ప్రభుత్వం. వారం వారం ధరలు మార్చే విధానం కంటే రోజువారీ సమీక్షే మంచిదని ప్రధాని, క్యాబినెట్ భావించారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆల్ పాకిస్తాన్ డీలర్స్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై దేశవ్యాప్త నిరసనలకు సిద్ధమవుతున్నట్లు హెచ్చరించింది.
సామాన్యుడిపై ద్రవ్యోల్బణ ప్రభావం
పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా చమురు సరఫరా ఆగిపోతుందనే భయంతో ఇంధన పొదుపు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో సబ్సిడీలు ఇస్తామని ప్రకటించిన పాలకులు, ఇప్పుడు రోజుకో రేటుతో ధరలు పెంచుతుండటంతో ఆ దేశంలో నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరిగిపోయి ద్రవ్యోల్బణం మరిన్ని కొత్త గరిష్టాలకు చేరే ప్రమాదం ఉంది.

