Pakistan Economic Crisis : పాకిస్థాన్‌లో పప్పుల సునామీ..ఖజానా ఖాళీ..కోట్లాది మంది ఆకలి కేకలు
ఖజానా ఖాళీ..కోట్లాది మంది ఆకలి కేకలు

Pakistan Economic Crisis : పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఇప్పటికే గోధుమలు, పిండి, బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతుండగా.. ఇప్పుడు ఆ దేశానికి కొత్తగా పప్పు కష్టాలు మొదలయ్యాయి. ఒకప్పుడు పప్పు దినుసులను ఇతర దేశాలకు ఎగుమతి చేసిన పాకిస్థాన్, నేడు తన ప్రజల ఆకలి తీర్చడానికి ఏకంగా 80 శాతం పప్పులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితికి చేరుకుంది. దీనివల్ల ఆ దేశ ఖజానా నుంచి ఏటా సుమారు 980 మిలియన్ డాలర్లు (దాదాపు 1 బిలియన్ డాలర్లు) విదేశీ మారకద్రవ్యం కరిగిపోతోంది.
ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. పాకిస్థాన్‌లో పప్పు దినుసుల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. 1998 కంటే ముందు పాకిస్థాన్ పప్పుల ఎగుమతిలో అగ్రగామిగా ఉండేది. కానీ ముషారఫ్ హయాంలో ఎగుమతులపై విధించిన ఆంక్షలు రైతుల నడ్డి విరిచాయి. పప్పుల సాగు లాభదాయకం కాదని భావించిన రైతులు క్రమంగా ఆ పంటలకు దూరమయ్యారు. నేడు పాకిస్థాన్ వార్షిక అవసరం 1.62 మిలియన్ టన్నులు కాగా, అందులో కేవలం 0.55 మిలియన్ టన్నులు మాత్రమే స్వదేశంలో పండుతోంది. మిగిలిన 1.07 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
పాకిస్థాన్‌లోని వ్యవసాయ పరిశోధనా సంస్థలు కూడా ఈ విఫలమవడంలో కీలక పాత్ర పోషించాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకుని, అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేయడంలో ఫెడరల్ సీడ్ కార్పొరేషన్ ఘోరంగా విఫలమైందని నిపుణులు విమర్శిస్తున్నారు. కేవలం వర్షాలపై ఆధారపడి సాగు చేసే ప్రాంతాల్లో వాతావరణ మార్పుల వల్ల దిగుబడి 35 శాతం వరకు పడిపోతోంది. సరైన మద్దతు లేక రైతులు వచ్చే సీజన్‌లో పప్పులను పండించడానికి భయపడుతున్నారు.
వరల్డ్ పల్సెస్ డే సందర్భంగా నిర్వహించిన సెమినార్‌లో శాస్త్రవేత్తలు పాకిస్థాన్ దుస్థితిని ఎండగట్టారు. పప్పుల సాగును ప్రోత్సహించడానికి అధికారులు ఒక ప్రపోజల్ సిద్ధం చేసినా, అది ఇంకా ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఇప్పటికే దివాళా అంచున ఉన్న పాకిస్థాన్, తన ఎయిర్ లైన్లను అమ్ముకోవడానికి సిద్ధమైంది. అప్పుల కోసం ఐఎంఎఫ్, అమెరికా ముందు మోకరిల్లుతున్న పాక్.. ఇప్పుడు తన ప్రజలకు కనీసం పప్పు అన్నం కూడా పెట్టలేని స్థితికి చేరుకోవడం గమనార్హం.

