Panasonic : ప్యానాసోనిక్ సంచలన నిర్ణయం.. ఇండియాలో ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వ్యాపారం బంద్
ఇండియాలో ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వ్యాపారం బంద్

Panasonic : కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో జపాన్ దిగ్గజం ప్యానాసోనిక్ భారతదేశంలో కొన్ని వ్యాపారాలను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. నివేదికల ప్రకారం, భారతదేశంలో రెఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ వ్యాపారాల నుండి ప్యానాసోనిక్ తప్పుకుంది. ఇకపై భారతదేశంలో ప్యానాసోనిక్ నుండి కొత్త ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు విడుదల కావు. అయితే, కంపెనీ ఇతర ఉత్పత్తులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి.
ప్యానాసోనిక్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతానికి భారతదేశానికి మాత్రమే పరిమితం. జపాన్ దేశానికి చెందిన ఈ పెద్ద కంపెనీ ఇతర ఉత్పత్తులైన ఎయిర్ కండిషనర్లు, టీవీలు యథాప్రకారంగా అందుబాటులో ఉంటాయి. పర్సనల్ కేర్ వస్తువులు, ఎనర్జీ సొల్యూషన్స్, బీ2బీ సర్వీసెస్ మొదలైనవి కొనసాగుతాయి.
ప్యానాసోనిక్ కంపెనీకి హర్యానాలోని ఝజ్జర్ లో ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్‌ల తయారీకి ఒక యూనిట్ ఉంది. దీనిని కంపెనీ మూసివేస్తోందనే వార్తలు వచ్చాయి. అది దాదాపు నిజమే. అయితే, ప్యానాసోనిక్ ఈ యూనిట్‌ను వేరే విధంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇతర కంపెనీల కోసం కాంట్రాక్ట్ ఆధారంగా వాషింగ్ మెషీన్‌లు, ఫ్రిజ్ ఉత్పత్తులను ఈ యూనిట్‌లో తయారు చేసే అవకాశం ఉంది. అంటే, ప్యానాసోనిక్ పేరుతో రావు కానీ, వేరే బ్రాండ్ల కోసం ఇక్కడే తయారీ జరుగుతుంది.
ఇప్పటికే అమ్ముడైన ప్యానాసోనిక్ ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్‌లకు సర్వీస్ కొనసాగుతుంది. కొత్త ఉత్పత్తులు మాత్రమే విడుదల కావు. అంటే, మీరు ప్యానాసోనిక్ ఫ్రిజ్ లేదా వాషింగ్ మెషీన్ కొని ఉంటే, వాటికి వారంటీ, సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్యానాసోనిక్ సంస్థ భవిష్యత్తులో బాగా అభివృద్ధి చెందే ఉత్పత్తులపై దృష్టి సారిస్తోంది. హోమ్ ఆటోమేషన్, హీటింగ్ వెంటిలేషన్, ఏసీలు, బీ2బీ సొల్యూషన్స్, ఎలక్ట్రికల్ సొల్యూషన్స్, ఎనర్జీ సొల్యూషన్స్ వంటి రంగాలను అది లక్ష్యంగా చేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా కూడా ప్యానాసోనిక్ ఇదే విధమైన మార్పులను చేస్తోంది. ఎక్కువ లాభాల మార్జిన్ ఉన్న ఈవీ బ్యాటరీలు, హోమ్ ఆటోమేషన్ వంటి రంగాలపై దృష్టి పెడుతోంది. గత నెలలో (2025 మే), ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. 2021లో ప్యానాసోనిక్ సింగపూర్‌లో ఉన్న తన కంప్రెసర్ యూనిట్‌ను మూసివేసి, మలేషియా, చైనాలో దానిని స్థాపించింది. అదే సంవత్సరం థాయ్‌లాండ్‌లో ఉన్న ఒక ఫ్యాక్టరీని వియత్నాంకు బదిలీ చేసింది. ఇవన్నీ కంపెనీ వ్యూహాత్మక మార్పుల్లో భాగం.
