ప్రతి ట్రాన్సాక్షన్‌పై డిజిటల్ గోల్డ్ రివార్డ్

Paytm : డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ పేటీఎం తమ వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇకపై యాప్ ద్వారా చేసే ప్రతి ట్రాన్సాక్షన్‌పై గోల్డ్ రివార్డ్ పొందే అవకాశం ఉంది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ గురువారం ఈ ప్రకటన చేసింది. దీని ప్రకారం, యూజర్లు సంపాదించిన లాయల్టీ పాయింట్లను ఇప్పుడు డిజిటల్ గోల్డ్‌గా మార్చుకోవచ్చు. అంతేకాకుండా పేటీఎం తమ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్‌తో కూడిన కొత్త వెర్షన్‌ను కూడా ప్రారంభించింది.

పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ.. ఇకపై పేటీఎం ద్వారా చేసే P2P (పర్సన్ టు పర్సన్), UPI పేమెంట్లు గోల్డెన్‎గా మారాయని తెలిపారు. వినియోగదారులు యాప్ ద్వారా డబ్బు పంపినా లేదా పేమెంట్ చేసినా వారికి గోల్డ్ పాయింట్స్‌ రూపంలో రివార్డ్ లభిస్తుంది. ఈ పాయింట్లను తర్వాత డిజిటల్ గోల్డ్‌గా మార్చుకోవచ్చు. "పేటీఎంలో ప్రతి పేమెంట్ ఇప్పుడు బంగారం సంపాదించడానికి ఒక మార్గం. మరే ఇతర యాప్ ఈ స్థాయిలో రివార్డులను ఇవ్వడం లేదు. మేము దీనిని చాలా సులభంగా, స్పష్టంగా ఉంచాం. మీరు ఎంత బంగారం సంపాదించవచ్చు అనే దానిపై పరిమితి లేదు" అని విజయ్ శేఖర్ శర్మ వివరించారు.

పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యుగల్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి రూ.100 ఖర్చు చేసినందుకు యూజర్‌కు ఒక గోల్డ్ పాయింట్ లభిస్తుంది. ఒకవేళ పేమెంట్ రూపే కార్డ్ ద్వారా చేస్తే, పాయింట్లు రెట్టింపు అవుతాయి. యూజర్ అకౌంట్‌లో పాయింట్ల విలువ రూ.15కి చేరుకున్నప్పుడు వాటిని డిజిటల్ గోల్డ్‌గా మార్చుకోవచ్చు. 100 గోల్డ్ కాయిన్స్‌ను రూపాయి విలువైన డిజిటల్ గోల్డ్‌గా రిడీమ్ చేసుకోవచ్చు. పేటీఎం తమ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌ను కూడా కొత్త వెర్షన్‌లో విడుదల చేసింది. దీనిలో స్మార్ట్ AI అసిస్టెంట్‌ను జోడించారు.

ఈ కొత్త AI అసిస్టెంట్ ప్రయాణికులకు టికెట్ బుకింగ్, ట్రావెల్ ప్లానింగ్‌లో సహాయం చేస్తుంది. యూజర్లు కేవలం మాట్లాడటం ద్వారా గమ్యస్థానాలను వెతకవచ్చు, ప్రయాణ ఆలోచనలు పొందవచ్చు, ఫ్లైట్, రైలు, బస్సు లేదా మెట్రో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. పూర్తి యాత్ర ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ AI బీటా వెర్షన్‌లో ఉంది. ప్లానింగ్ నుంచి పేమెంట్ వరకు వినియోగదారులకు మరింత స్మార్ట్ ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story