Paytm : పేటీఎంలో భారీ మార్పులు..రూ.2,580 కోట్ల వ్యాపారం ఆ సంస్థకు బదిలీ
రూ.2,580 కోట్ల వ్యాపారం ఆ సంస్థకు బదిలీ

Paytm : పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్.. తమ పనితీరును పూర్తిగా మార్చేసే ఒక పెద్ద వ్యూహాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన కఠినమైన మార్గదర్శకాలను పాటించడానికి, కంపెనీ తన ఆఫ్‌లైన్ మర్చెంట్ పేమెంట్స్ వ్యాపారాన్ని పూర్తిగా తమ అనుబంధ సంస్థ అయిన పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్(పీపీఎస్ఎల్)కు బదిలీ చేయడానికి అంగీకరించింది. ఈ నిర్ణయం ద్వారా పేమెంట్స్ బిజినెస్ మరింత నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా, క్రమబద్ధీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రూప్‌లోని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మర్చెంట్ పేమెంట్స్ వ్యాపారాలను ఒకే సంస్థ పీపీఎస్ఎల్ కిందకు తీసుకురావడమే ఈ బదిలీ ప్రధాన లక్ష్యమని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలియజేసింది. పీపీఎస్ఎల్ సంస్థకు ఇప్పటికే ఆన్‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్‌గా పనిచేయడానికి ఆర్‌బీఐ నుంచి సూత్రప్రాయంగా అనుమతి లభించింది. పేటీఎం ఆఫ్‌లైన్ మర్చెంట్ పేమెంట్స్ వ్యాపారంలో.. కంపెనీ క్యూఆర్ కోడ్, సౌండ్‌బాక్స్, ఈడీసీ యంత్రాల ద్వారా పేమెంట్స్ తీసుకునే వ్యాపారులందరూ ఉన్నారు. ఈ వ్యాపారాన్ని స్లoప్ సేల్ పద్ధతిలో అంటే, మొత్తంగా ఒకేసారి విక్రయించడం ద్వారా బదిలీ చేయనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పేటీఎం ఆఫ్‌లైన్ మర్చెంట్ పేమెంట్స్ వ్యాపారం సుమారు రూ.2,580 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. బదిలీ అవుతున్న ఈ వ్యాపారం నికర విలు మార్చి 31, 2025 నాటికి సుమారు రూ.960 కోట్లుగా ఉంది.
ఈ బదిలీ ఒక హోల్డింగ్ కంపెనీ నుంచి దాని 100% అనుబంధ సంస్థకు జరుగుతున్నందున, కంపెనీ కన్సాలిడేటెడ్ ఆర్థిక ఫలితాలపై ఎలాంటి ప్రభావం పడదని వన్97 కమ్యూనికేషన్స్ స్పష్టం చేసింది. షేర్‌హోల్డర్లు, పీపీఎస్ఎల్ బోర్డు నుంచి తుది ఆమోదం లభించిన తర్వాత, ఈ బదిలీ ప్రక్రియ 2025 డిసెంబర్ 31 లేదా అంతకు ముందు పూర్తవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.
