pepsico: గ్లోబల్ ఫుడ్, బెవరేజ్ దిగ్గజం పెప్సీకో భారత మార్కెట్‌పై తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్ధమైంది. 2030 నాటికి దేశంలో ఏకంగా రూ. 5,700 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. భారత్‌ను తమ గ్లోబల్ టాప్-10 మార్కెట్ల జాబితాలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కంపెనీ విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేసింది. భారత్‌లో పెరుగుతున్న వినియోగాన్ని, కొనుగోలు శక్తిని ఆసరాగా చేసుకుని వ్యాపారాన్ని విస్తరించేందుకు పెప్సీకో రూ.5,700 కోట్ల రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. ఈ క్రమంలోనే అస్సాంలోని నల్బారీలో కంపెనీ ఐదో తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది. దాదాపు రూ.778 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంట్ ఈశాన్య భారతంలో కంపెనీకి వ్యూహాత్మక బలాన్ని ఇస్తుంది. దీనికంటే ముందే మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఒక ప్లాంట్ ప్రారంభించగా, దక్షణాది మార్కెట్‌ను ఏలేందుకు తమిళనాడులోని తిరుచిరాపల్లిలో మరో నూతన ప్లాంట్ ఏర్పాటుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ప్రాంతీయ రుచుల ఆధారంగా కొత్త ఉత్పత్తులు

ఇప్పటివరకు దేశమంతటికీ ఒకే రకమైన ఉత్పత్తులను అందించే పద్ధతికి పెప్సీకో స్వస్తి పలకనుంది. భారతీయ ఆహార వైవిధ్యాన్ని గుర్తించి స్థానిక రుచులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిశ్చయించుకుంది. ఇండియా, సౌత్ ఆసియా సీఈఓ జాగ్రత్ కోటేచా వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశాన్ని 7 లేదా 9 విభిన్న భౌగోళిక ప్రాంతాలుగా విభజించి, ఆయా ప్రాంతాల ప్రజల అభిరుచులకు తగినట్లు ఉత్పత్తులను తీర్చిదిద్దనున్నారు. "భారత్‌లో తయారవ్వాలి, భారత్ కోసం తయారవ్వాలి, భారతీయుల ద్వారానే తయారవ్వాలి" అనే స్పష్టమైన నినాదంతో ముందుకెళ్తున్నారు.

రైతులకు, యువతకు ఊహించని ప్రయోజనాలు

ఈ భారీ విస్తరణతో దేశీయ వ్యవసాయం, ఉపాధి రంగాలకు విపరీతమైన లబ్ధి చేకూరనుంది. అస్సాంలో 44.2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్లాంట్ ద్వారా సుమారు 700 మందికి నేరుగా ఉద్యోగాలు లభిస్తాయి. చిప్స్ తయారీకి అవసరమైన ప్రత్యేక బంగాళాదుంపలను పండించే 5,000 మందికి పైగా రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది. అంతేకాకుండా, 60,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యానికి కొత్త డిమాండ్ ఏర్పడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుంది.

గ్లోబల్ టాప్-10 లీగ్‌లోకి భారత్

ప్రస్తుతం పెప్సీకో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత కీలకమైన 13 మార్కెట్లలో భారతదేశం ఒకటిగా ఉంది. 2025 నాటికి పెప్సీకో ఇండియా టర్నోవర్ రూ. 9,789 కోట్లకు చేరగా, బాట్లింగ్ భాగస్వామి వరుణ్ బెవరేజెస్ రాబడి రూ.15,070.7 కోట్లను తాకింది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మనదేశంలో ప్యాకేజ్డ్ ఫుడ్ వినియోగం ఇంకా తక్కువగానే ఉంది. ఈ ఖాళీని పూరించడమే లక్ష్యంగా పెట్టుకున్న కంపెనీ త్వరలోనే భారత్‌ను తన టాప్-10 గ్లోబల్ మార్కెట్లలో నిలబెట్టాలని భావిస్తోంది.

Next Story