Personal Loan vs Credit Card : పర్సనల్ లోన్ vs క్రెడిట్ కార్డు ఈఎంఐ.. జేబు ఖాళీ చేసేది ఏది? పొదుపు చేసేది ఏది?
జేబు ఖాళీ చేసేది ఏది? పొదుపు చేసేది ఏది?

Personal Loan vs Credit Card : ఆకస్మికంగా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, ఖరీదైన గ్యాడ్జెట్స్ కొనాలన్నా లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నా.. వెంటనే గుర్తొచ్చేది అప్పు. చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు మన ముందు ప్రధానంగా రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకటి బ్యాంకు నుంచి పర్సనల్ లోన్ తీసుకోవడం, రెండోది క్రెడిట్ కార్డుపై ఉన్న మొత్తాన్ని ఈఎంఐగా మార్చుకోవడం. పైకి చూడటానికి ఇవి రెండూ ఒకేలా అనిపించినా, మీ జేబుకు ఏది తూట్లు పొడుస్తుందో, ఏది లాభసాటిగా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వడ్డీ రేట్లు, హిడెన్ ఛార్జీలు, రీపేమెంట్ వెసులుబాటు వంటి అంశాల్లో ఈ రెండింటికీ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
వడ్డీ రేట్లు.. ఎవరి బాదుడు ఎక్కువ?
సాధారణంగా పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు మీ క్రెడిట్ స్కోర్, జీతంపై ఆధారపడి ఉంటాయి. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే 10.5% నుంచి 15% మధ్యలోనే లోన్ దొరికే అవకాశం ఉంటుంది. కానీ క్రెడిట్ కార్డు ఈఎంఐల కథ వేరు. చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డు ఈఎంఐలపై ఏటా 18% నుంచి 24% వరకు వడ్డీ వసూలు చేస్తాయి. అంటే పర్సనల్ లోన్ తో పోలిస్తే క్రెడిట్ కార్డు ఈఎంఐ దాదాపు రెట్టింపు భారం మోపుతుంది. కేవలం బ్యాంకులు ఇచ్చే ప్రత్యేక ఆఫర్లు ఉంటే తప్ప, క్రెడిట్ కార్డు ఈఎంఐ వైపు వెళ్లకపోవడమే ఉత్తమం.
నో కాస్ట్ ఈఎంఐ వెనుక ఉన్న మాయాజాలం!
షాపింగ్ మాల్స్‌లో నో కాస్ట్ ఈఎంఐ బోర్డులు చూసి మనం మురిసిపోతుంటాం. కానీ ఇక్కడో చిన్న మెలిక ఉంది. వడ్డీ లేదని చెప్పే ఈ ఈఎంఐలలో, వడ్డీకి సమానమైన మొత్తాన్ని వస్తువు ధరపై వచ్చే డిస్కౌంట్ రూపంలో కట్ చేస్తారు. అంటే మీరు నగదు ఇచ్చి కొంటే వచ్చే డిస్కౌంట్ ఈఎంఐలో రాదు. వీటికి అదనంగా ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్‌టీ కూడా వడ్డిస్తారు. పర్సనల్ లోన్ లో ప్రాసెసింగ్ ఫీజు ముందే స్పష్టంగా చెబుతారు కాబట్టి, దాచడానికి ఏమీ ఉండదు. కానీ క్రెడిట్ కార్డు ఈఎంఐలో ఈ చిన్న ఛార్జీలు అన్నీ కలిసి మీ జేబుకు పెద్ద రంధ్రమే చేస్తాయి.
క్రెడిట్ లిమిట్, ఫ్లెక్సిబిలిటీ
క్రెడిట్ కార్డుపై ఈఎంఐ పెట్టుకుంటే మీ కార్డు క్రెడిట్ లిమిట్ తగ్గిపోతుంది. ఉదాహరణకు మీ లిమిట్ ఒక లక్ష ఉండి, మీరు 80 వేల ఫోన్ ఈఎంఐలో కొంటే, ఆ అప్పు తీరే వరకు మీ కార్డులో కేవలం 20 వేలు మాత్రమే వాడుకోవడానికి వీలుంటుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో మీకు ఇబ్బంది కలిగించవచ్చు. పర్సనల్ లోన్ అలా కాదు, అది మీ క్రెడిట్ కార్డుతో సంబంధం లేకుండా విడిగా ఉంటుంది. అలాగే పర్సనల్ లోన్లను 5 ఏళ్ల వరకు చెల్లించుకునే వెసులుబాటు ఉంటుంది. క్రెడిట్ కార్డు ఈఎంఐలు సాధారణంగా 2 ఏళ్ల లోపే ముగించాల్సి వస్తుంది, దీనివల్ల నెలకు కట్టాల్సిన ఈఎంఐ భారం పెరుగుతుంది.
ఏది బెస్ట్?
మీరు చేసే ఖర్చు పెద్ద మొత్తంలో ఉండి (ఉదాహరణకు రూ.లక్ష పైన), ఎక్కువ కాలం తీర్చుకోవాలనుకుంటే పర్సనల్ లోన్ వైపు వెళ్లడం తెలివైన పని. ఇందులో వడ్డీ తక్కువ, మీ క్రెడిట్ కార్డు ఖాళీగా ఉంటుంది. అలా కాకుండా కేవలం రూ. 20-30 వేల లోపు వస్తువులను కొని, ఆర్నెళ్లలో తీర్చేయగలము అనుకుంటే క్రెడిట్ కార్డు ఈఎంఐని ఎంచుకోవచ్చు. ఏది ఏమైనా, సంతకం చేసే ముందు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదవడం మర్చిపోకండి.

