Petrol Price : పెట్రోల్ ధరలతో విలవిలలాడుతున్న అమెరికా, పాక్.. భారత్‌లో మాత్రం ప్రశాంతం
భారత్‌లో మాత్రం ప్రశాంతం

Petrol Price : ప్రస్తుతం ప్రపంచమంతా ఇంధన సెగతో ఉడికిపోతోంది. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఆటంకాలు వెరసి ముడిచమురు ధరలను ఆకాశానికి చేర్చాయి. ఫలితంగా అగ్రరాజ్యం అమెరికా నుంచి మన పొరుగున ఉన్న పాకిస్తాన్ వరకు పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. కొన్ని దేశాల్లో ఇంధన ధరలు ఏకంగా 112 శాతం వరకు పెరగడం గమనార్హం. అయితే, ఇంతటి భయంకరమైన గ్లోబల్ క్రైసిస్‌లోనూ భారత్ ఒక అజేయమైన కోటలా నిలబడింది. ప్రపంచ దేశాలన్నీ ద్రవ్యోల్బణంతో అల్లాడుతుంటే, భారత్ తన వ్యూహాత్మక విధానాలతో సామాన్యుడిపై భారం పడకుండా కాపాడగలిగింది.
భారతదేశం చుట్టూ ఉన్న దేశాల పరిస్థితి చూస్తే ఆర్థిక సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. పాకిస్తాన్‌లో పెట్రోల్ ధర 54.9%, డీజిల్ 44.9% పెరిగి సామాన్యుడి నడ్డి విరిచింది. శ్రీలంకలో పెట్రోల్ 38.2%, డీజిల్ 41.8% ఎగబాకింది. చిన్న దేశమైన నేపాల్‌లో డీజిల్ ధర ఏకంగా 58.5% పెరిగింది. ఇక తనను తాను సూపర్ పవర్‌గా చెప్పుకునే చైనాలో సైతం పెట్రోల్ ధరలు 21.7% పెరిగాయి. కానీ, ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్‌లో పెట్రోల్ ధర కేవలం 3.2%, డీజిల్ 3.4% మాత్రమే పెరగడం విశేషం. ఇది భారత ప్రభుత్వ అద్భుతమైన ఆర్థిక నిర్వహణకు నిదర్శనం.
పేద దేశాల నుంచి ధనిక దేశాల వరకు చమురు మంట ఎవరినీ వదిలిపెట్టలేదు. మయన్మార్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అక్కడ పెట్రోల్ 89.7% పెరగ్గా, డీజిల్ ఏకంగా 112.7% పెరిగి సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా పెట్రోల్ 44.5%, డీజిల్ 48.1% ప్రియమయ్యాయి. చమురు ఉత్పత్తి చేసే యూఏఈలో సైతం డీజిల్ ధర 86.1% పెరగడం గమనార్హం. వియత్నాం, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లోనూ ధరలు 50 శాతం పైగా పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
తమ ఆర్థిక వ్యవస్థలు అత్యంత పటిష్టమైనవి అని గర్వపడే యూరప్ దేశాలు సైతం చమురు సంక్షోభం ముందు తలవంచాయి. యునైటెడ్ కింగ్డమ్లో డీజిల్ ధర 34.2%, ఫ్రాన్స్‌లో 31%, బెల్జియంలో 30.9% పెరిగాయి. జర్మనీ, ఇటలీ దేశాల్లోనూ రెండంకెల స్థాయిలో ధరల పెరుగుదల నమోదైంది. ఆస్ట్రేలియాలో డీజిల్ 43.1%, న్యూజిలాండ్‌లో ఏకంగా 88.6% పెరిగి రికార్డు సృష్టించాయి. ఈ దేశాలతో పోలిస్తే భారత్ అవలంబించిన రష్యన్ ఆయిల్ డిప్లమసీ, దేశీయ పన్నుల సర్దుబాటు విధానం మన దేశాన్ని ఈ ధరల తుపాను నుంచి రక్షించాయి.
భారత్ ఎలా సాధ్యం చేసింది?
ప్రపంచవ్యాప్తంగా ధరలు 50 నుంచి 100 శాతం పెరుగుతుంటే భారత్ కేవలం 3 శాతంతోనే ఎలా సరిపెట్టింది? ఇది ఏమాత్రం యాదృచ్ఛికం కాదు. భారత్ తన కమ్యూనికేషన్, దౌత్య సంబంధాలను ఉపయోగించి రష్యా వంటి దేశాల నుంచి తక్కువ ధరకే ముడిచమురును దిగుమతి చేసుకుంది. అంతేకాకుండా, అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు దేశీయ చమురు కంపెనీలు సామాన్యుడిపై భారం పడకుండా తమ నష్టాలను తామే భరించాయి. ప్రపంచ వేదికపై భారత్ ఒక బాధ్యతాయుతమైన, బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

