OMCs : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు నిరంతరం మారుతున్నప్పటికీ, దేశీయంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. గత 15 రోజుల్లోనే చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను 4 సార్లు పెంచి.. మొత్తంగా లీటరుపై దాదాపు రూ.8 వరకు భారాన్ని మోపిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, ప్రస్తుత పంప్ ధరల ప్రకారం కంపెనీలకు లీటరు పెట్రోల్, డీజిల్‌పై ఇంకా రూ. 7 నుంచి రూ. 8 వరకు భారీ నష్టం వాటిల్లుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడి, మరోవైపు రాజకీయ కారణాల వల్ల దేశీయంగా ఇంధన ధరలను విచ్చలవిడిగా పెంచలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తాజా నివేదిక ప్రకారం.. చమురు కంపెనీలు నష్టాల నుంచి బయటపడి నో ప్రాఫిట్, నో లాస్ స్థాయికి రావాలంటే, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర కచ్చితంగా తగ్గాల్సిందేనని స్పష్టం చేసింది.

85 డాలర్ల వద్దే బ్రేక్-ఈవెన్ పాయింట్

జెఫరీస్ నివేదిక ప్రకారం.. మన ప్రభుత్వ చమురు కంపెనీల ఖర్చులు సరిపోవాలంటే అంతర్జాతీయంగా బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 85 నుంచి 87 డాలర్ల పరిధిలోకి రావాలి. ఈ రేటు కంటే ఒక్క డాలర్ ఎక్కువ ఉన్నా కంపెనీలు నష్టాల్లోనే కొనసాగుతాయి. ఒకవేళ చమురు ధర 85 డాలర్ల కంటే కిందికి పడిపోతేనే కంపెనీలకు కనీస లాభాలు దక్కుతాయి. అయితే, జెఫరీస్ టాప్ అనలిస్ట్ మహేష్ నందుర్కర్ అంచనా ప్రకారం.. రాబోయే జూలై 2026 నుంచి అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సగటున 90 డాలర్ల వద్ద స్థిరపడే అవకాశం ఉంది. అంటే, రాబోయే రోజుల్లో దేశీయంగా ఇంధన ధరలను మరింత పెంచకపోతే చమురు కంపెనీల నష్టాల బాదుడు ఇలాగే కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

సామాన్యుడి ఉపశమనం కోసం కంపెనీల బలి

చమురు కంపెనీలు ఇంతలా నష్టపోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యూహాలే కారణం. మార్చి 2026 లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని ఏకంగా 40 శాతం వరకు తగ్గించింది. దీంతో ఇంధన ధరలు పదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయి సామాన్యులకు భారీ ఉపశమనం లభించింది. రాబోయే ఆర్థిక సంవత్సరం 2027 లోనూ ఈ పన్ను తగ్గింపును ఇలాగే కొనసాగించాలని కేంద్రం గట్టి పట్టుదలతో ఉంది. ప్రజలకు ఇచ్చిన ఈ పన్ను ఉపశమనాన్ని వెనక్కి తీసుకోవడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీనివల్ల పన్నుల మార్పుల ద్వారా చమురు కంపెనీల లాభాలను పెంచేందుకు ప్రభుత్వానికి ప్రస్తుతం ఎలాంటి వీలు లేకుండా పోయింది. ఫలితంగా ప్రభుత్వమే నేరుగా ఆర్థిక భారాన్ని మోయకుండా.. చమురు కంపెనీలనే ‘షాక్ అబ్జార్బర్‌’ లాగా వాడుకుంటోంది.

కేంద్ర బడ్జెట్‌పై రూ. 90,000 కోట్ల భారం

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల వద్దే కొనసాగితే, అది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక లెక్కలపై భారీ ప్రభావం చూపనుంది. పెరిగిన చమురు ధరల వల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ (ఎరువులు), ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీల భారం అమాంతం పెరిగిపోతుంది. అంతర్జాతీయంగా యూరియా ధరలు ఇప్పటికే రెట్టింపు అవ్వగా, దిగుమతి చేసుకునే ఎల్‌ఎన్‌జీ (LNG) ఖర్చు కూడా 40 నుండి 50 శాతం పెరిగింది. దీనివల్ల ఆర్థిక సంవత్సరం 2027 లో ఎరువుల సబ్సిడీ కోసం అదనంగా రూ. 30,000 నుంచి రూ. 40,000 కోట్లు, ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీ కోసం మరో రూ. 20,000 నుంచి రూ. 30,000 కోట్లు ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

మొత్తంగా చూస్తే ఈ చమురు సంక్షోభం వల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాపై రూ.75,000 కోట్ల నుంచి రూ.90,000 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. ఇది దేశ జీడీపీలో 20 నుంచి 25 బేసిస్ పాయింట్లకు సమానం. ఆర్థిక సంవత్సరం 2027 నాటికి దేశ ఆర్థిక లోటును జీడీపీలో 4.3 శాతానికి పరిమితం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం రక్షణ రంగేతర మూలధన వ్యయాల్లో అంటే మౌలిక వసతుల కల్పన, కొత్త ప్రాజెక్టుల బడ్జెట్‌లో భారీగా కోతలు పెట్టే అవకాశముంది. అందువల్ల చమురు కంపెనీల నష్టాలను నేరుగా క్యాష్ రూపంలో భర్తీ చేయడం ప్రభుత్వానికి మరింత కష్టంగా మారనుంది.

తగ్గనున్న వర్షాలు.. పెరగనున్న గ్రామీణ ఖర్చులు

ఈ చమురు కష్టాలకు తోడు భారత వాతావరణ శాఖ (IMD) మరో చేదు వార్త చెప్పింది. ఈసారి దేశంలో రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని, సాధారణం కంటే 8 శాతం తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాలు తగ్గితే గ్రామీణ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడి, ఉపాధి హామీ పథకం (MGNREGA) పై ప్రభుత్వం అదనంగా రూ. 10,000 నుంచి రూ. 20,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ సవాళ్లన్నింటినీ అధిగమించడానికి కేంద్రం పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ఇతర మార్గాలపై దృష్టి పెట్టింది.

ఇందులో భాగంగానే బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 9 శాతం పెంచి.. మొత్తంగా 15 శాతానికి చేర్చింది. దీనివల్ల ప్రభుత్వానికి రూ. 40,000 నుం రూ. 50,000 కోట్ల అదనపు ఆదాయం రానుంది. అలాగే ఇంధన ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ టాక్స్ ద్వారా మరో రూ. 5,000 నుంచి రూ. 10,000 కోట్లు రాబట్టాలని చూస్తోంది. అలాగే ప్రభుత్వ సంస్థల డిసిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని కూడా బడ్జెట్‌లో రెట్టింపు చేసింది. ఏదేమైనప్పటికీ, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 85 డాలర్ల స్థాయికి దిగివచ్చేంత వరకు చమురు కంపెనీలకు ఈ నష్టాల నరకం తప్పేలా లేదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story