Food Delivery : ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే స్మార్ట్‌ఫోన్ క్లిక్‌తో వేడివేడి బిర్యానీ లేదా కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేసుకునే ఆన్‌లైన్ ప్రియులకు త్వరలోనే పెట్రోల్ సెగ తగలనుంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల వల్ల దేశీయంగా ఇంధన ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ లీటరు పెట్రోల్, డీజిల్ ధరల భారం.. ఇప్పుడు నేరుగా ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లైన జొమాటో, స్విగ్గీలపై పడబోతోంది. ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ ఎలారా క్యాపిటల్ తన తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల డెలివరీ ఖర్చులు భారమై.. ఆ అదనపు భారాన్ని కంపెనీలు కస్టమర్ల తలపైనే వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఎలారా క్యాపిటల్ నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ పరిణామాల వల్ల దేశంలో ఇటీవల లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు సుమారు రూ.4 వరకు పెరిగాయి. అంటే ఇంధన ధరల్లో దాదాపు 4 శాతం మేర వృద్ధి నమోదైంది. ఈ ధరల పెరుగుదల స్విగ్గీ, జొమాటో వంటి ప్లాట్‌ఫారమ్‌ల డెలివరీ ఎకనామిక్స్ పై తీవ్ర ఒత్తిడిని తీసుకువస్తోంది. బైక్‌లపై తిరుగుతూ రాత్రి పగలు తేడా లేకుండా ఫుడ్ డెలివరీ చేసే గిగ్ వర్కర్లు.. తమ జేబుల నుంచి పెట్రోల్ డబ్బులు ఎక్కువ ఖర్చవుతుండటంతో కంపెనీల నుంచి హై పేమెంట్స్ డిమాండ్ చేసే రిస్క్ ఉందని ఈ నివేదిక హెచ్చరించింది.

ఒక్కో ఆర్డర్‌పై డెలివరీ ఖర్చు ఎంత అవుతుందో తెలుసా?

ఆన్‌లైన్ కంపెనీలకు డెలివరీ నిర్వహణ అనేది చాలా ఖరీదైన వ్యవహారం. ఎలారా క్యాపిటల్ లెక్కల ప్రకారం.. బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ యాప్స్‌లో ఒక ఆర్డర్ కస్టమర్‌కు చేరడానికి కంపెనీలకు సగటున రూ.35 నుంచి రూ.50 వరకు ఖర్చవుతుంది. అదే జొమాటో, స్విగ్గీ యాప్స్‌లో ఫుడ్ డెలివరీ చేయడానికి ఒక్కో ఆర్డర్‌కు సగటున రూ.55 నుంచి రూ.60 వరకు ఖర్చవుతుంది. మొత్తంగా చూసుకుంటే, ప్రస్తుతం జొమాటోకు సగటున రూ.45, స్విగ్గీకి రూ.55 వరకు బేస్ డెలివరీ కాస్ట్ అవుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మీ బిల్లుపై ఎలా పడుతుందంటే?

సాధారణంగా ఒక ఫుడ్ ఆర్డర్ డెలివరీ ఖర్చులో పెట్రోల్ వాటా దాదాపు 20 శాతంగా ఉంటుంది. అంటే ప్రతి ఆర్డర్‌పై కేవలం ఇంధనానికే సుమారు రూ.9 నుంచి రూ.10 వరకు ఖర్చవుతుంది. ఇప్పుడు పెరిగిన 4 శాతం పెట్రోల్ ధరల వల్ల.. కంపెనీలకు ప్రతి ఆర్డర్‌పై కనీసం 0.44 పైసల అదనపు భారం పడుతుంది. అయితే రాబోయే రోజుల్లో ఒకవేళ పెట్రోల్ ధరలు లీటరుకు రూ.10 వరకు పెరిగితే మాత్రం.. ఈ భారం ఒక్కో ఆర్డర్‌పై రూ.1 నుండి రూ.1.20 పైసల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ అదనపు భారం వల్ల జొమాటో, స్విగ్గీ కంపెనీల ఆర్థిక లాభాలపై 5 నుంచి 12 శాతం వరకు ప్రతికూల ప్రభావం పడుతుంది.

కస్టమర్ల జేబులకు చిల్లు.. భారం తప్పదా?

ఈ అదనపు పెట్రోల్ భారాన్ని కంపెనీలు పూర్తిగా తమ సొంత లాభాల నుంచి భరించడం అసాధ్యం. కాబట్టి స్విగ్గీ, జొమాటోలు స్మార్ట్ ప్లాన్ అమలు చేయబోతున్నాయి. ఈ పెరిగిన ఇంధన ఖర్చులను.. కస్టమర్ల నుంచి వసూలు చేసే డెలివరీ ఛార్జ్ లేదా ప్లాట్‌ఫారమ్ ఫీజు రూపంలో పెంచేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. అంటే మీరు ఆర్డర్ చేసే బిర్యానీ ధర మారకపోయినా.. బిల్లు చివరన పడే అదనపు ఛార్జీల వల్ల మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. ఇప్పటికే కంపెనీలు రూ.5 నుంచి రూ.6 వరకు ప్లాట్‌ఫారమ్ ఫీజు వసూలు చేస్తుండగా, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story