Petrol Pump Toilets: ప్రయాణ సమయంలో హైవేలు అలాగే నగరాల్లోని పెట్రోల్ బంకులలో శుభ్రమైన టాయిలెట్లు దొరకడం ఒకప్పుడు పెద్ద సమస్యగా ఉండేది. ఈ ఇబ్బందిని పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీలు రంగంలోకి దిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యూయల్ స్టేషన్లలో పరిశుభ్రతా ప్రమాతలను పెంచేందుకు చర్యలు చేపట్టాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్వచ్ఛతా అభియాన్‌లో భాగంగా ఉన్నత స్థాయి అధికారులు నేరుగా బంకులను సందర్శించి తనిఖీలు చేస్తున్నారు.

క్యూఆర్ కోడ్ ద్వారా కస్టమర్ల ఫీడ్‌బ్యాక్

ఈ సరికొత్త కార్యక్రమంలో భాగంగా బంకుల టాయిలెట్ల వద్ద ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేశారు. ముంబై, న్యూఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రధాన బంకులను ఐఓసీఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ సౌమిత్ర ప్రియా శ్రీవాత్సవ్, బీపీసీఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ శుభాంకర్ సేన్ స్వయంగా పరిశీలించారు. వినియోగదారులు వాష్‌రూమ్‌లను ఉపయోగించిన తర్వాత అక్కడి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నేరుగా తమ అనుభవాలను రేటింగ్ రూపంలో ఇవ్వవచ్చు. ఏవైనా లోపాలు ఉంటే ఫిర్యాదులు చేసే సదుపాయం కూడా ఇందులో కల్పించారు.

నిరంతరం పర్యవేక్షణ,సెన్సార్ టెక్నాలజీ

కేవలం అధికారుల తనిఖీలకే పరిమితం కాకుండా టాయిలెట్ల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. కొన్ని అధునాతన బంకుల్లో సెన్సార్ ఆధారిత పద్ధతులను కూడా అమలు చేస్తున్నారు. దీనివల్ల ఎప్పటికప్పుడు శుభ్రతను కాపాడటానికి ఆస్కారం ఉంటుంది. కోల్‌కతా, ఇండోర్, జబల్పూర్, రీవా లాంటి అనేక నగరాల్లో ఈ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. వినియోగదారుల నుంచి వచ్చే ప్రతికూల ఫీడ్‌బ్యాక్‌పై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కంపెనీలు బంక్ డీలర్లను ఆదేశించాయి.

ప్రయాణికులకు మెరుగైన వసతులు

సుదూర ప్రయాణాలు చేసే సాధారణ వాహనదారులు అలాగే కుటుంబాలతో వెళ్లే వారికి శుభ్రమైన విశ్రాంతి గదులు ఎంతో అవసరం. ఈ సౌకర్యాలు కేవలం నామమాత్రంగా కాకుండా నిజమైన సేవలతో కూడిన అనుభూతిని ఇవ్వాలన్నదే కంపెనీల ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తులో ఇంధన లభ్యతతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కూడా బంకుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సరికొత్త విధానం ద్వారా పెట్రోల్ బంకుల సేవా ప్రమాణాలు పూర్తిగా మారుతాయని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story