Pharma Industry: చైనా నుంచి భారతదేశానికి క్యూ కడుతున్న ఫార్మా ఆర్డర్లు.. చిన్న కంపెనీలకు జాక్‌పాట్
చిన్న కంపెనీలకు జాక్‌పాట్

Pharma Industry: ప్రపంచ ఫార్మా రంగంలో భారత్ వైపు గ్లోబల్ కంపెనీల చూపు వేగంగా మళ్లుతోంది. చైనాపైనే పూర్తిగా ఆధారపడకుండా తమ సప్లై చైన్‌ను విస్తరించాలని పాశ్చాత్య దేశాలు భావిస్తుండటంతో, గతంలో చైనాకు వెళ్లే అనేక ఫార్మా ఆర్డర్లు ఇప్పుడు భారతదేశంలోని చిన్న, మధ్యతరహా (MSME) కంపెనీలకు తరలివస్తున్నాయి. ఫార్మా రంగానికి అత్యంత కీలకమైన సిపిహెచ్ఐ వరల్డ్‌వైడ్ గ్లోబల్ ప్రదర్శనలో పాల్గొన్న భారతీయ కంపెనీలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ముఖ్యంగా డ్రగ్ ఇంటర్‌మీడియట్స్ సప్లై చేసే భారతీయ తయారీదారులకు అంతర్జాతీయంగా డిమాండ్ విపరీతంగా పెరిగింది.
ఫార్మాస్యూటికల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వ పెవిలియన్‌లో దాదాపు 40 చిన్న, మధ్యతరహా ఫార్మా కంపెనీలు పాల్గొన్నాయి. సూపర్ణా కెమికల్స్, సిద్ధార్థ్ ఇంటర్నేషనల్, రినీ లైఫ్ సైన్స్, సర్వాణి ల్యాబ్స్, దక్కన్ న్యూట్రాస్యూటికల్స్, క్లారియాన్ ఆర్గానిక్స్ వంటి సంస్థలు తమ ప్రతిభను చాటుకున్నాయి. తక్కువ కార్మిక ఖర్చులు, దేశీయంగా లభించే నైపుణ్యం వల్ల డ్రగ్ ఇంటర్‌మీడియట్స్, ఏపీఐల తయారీలో భారత్ అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది.
ఒకప్పుడు ఏ చిన్న రసాయనం కావాలన్నా చైనా వైపే చూసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కథ మారింది. 1995 నుంచి ఫార్మా రంగంలో ఉన్న క్లారియాన్ ఆర్గానిక్స్ సంస్థ గతంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఒక ముక్కు స్ప్రే ఇంటర్‌మీడియట్ కెమికల్‌ను, ఇప్పుడు తిరిగి చైనాకే ఎగుమతి చేస్తోండటం గమనార్హం. గతంలో అమెరికా నుంచి చైనాకు వెళ్లే ఫార్మా కాంట్రాక్టులు కూడా ఇప్పుడు భారతీయ చిన్న కంపెనీల చేతికి వస్తున్నాయి. రాబోయే రెండు దశాబ్దాల పాటు గ్లోబల్ మార్కెట్‌లో భారత్, చైనాల పోటీ ఆసక్తికరంగా సాగనుంది.
ఐరోపా దేశాల్లో తయారీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో, గ్లోబల్ కంపెనీలు ఆసియా వైపు చూస్తున్నాయి. అయితే విదేశీ కంపెనీలు చైనాను పూర్తిగా పక్కన పెట్టలేదని, చైనాతో పాటు భారత్‌ను ఒక బలమైన ప్రత్యామ్నాయ సరఫరాదారుగా అభివృద్ధి చేసుకుంటున్నాయని ఫార్మా రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ భారతీయ ఫార్మా కంపెనీల నాణ్యత, సరసమైన ధరలు ప్రపంచ కొనుగోలుదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఫార్మా ఆర్డర్లు పెరుగుతున్నప్పటికీ, భారతదేశం ఇప్పటికీ ప్రాథమిక ముడి సరుకుల కోసం చైనాపైనే ఆధారపడుతోంది. ఉత్పత్తుల ధరల పోటీలో చైనాను పూర్తిగా ఢీకొట్టాలంటే రా మెటీరియల్స్ విషయంలో మన దేశంలోనే పూర్తి స్థాయి స్వయంసమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. ఈ చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తే రాబోయే రోజుల్లో గ్లోబల్ ఫార్మా రాజధానిగా భారత్ మరింత శరవేగంగా ఆవిర్భవిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

