PM Kisan : రైతులకు గుడ్‌న్యూస్.. నవంబర్ 19న అకౌంట్లలోకి రూ.2,000!
నవంబర్ 19న అకౌంట్లలోకి రూ.2,000!

PM Kisan : బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ కోట్ల మంది రైతులకు తీపి కబురు అందించబోతున్నారు. దేశంలోని 11 కోట్ల మందికి పైగా రైతులకు ఆర్థిక సహాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా, 21వ విడత నిధులను నవంబర్ 19న విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఆ డబ్బు ఎప్పుడు, ఎవరికి వస్తుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హత ఉన్న రైతు కుటుంబాలకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ డబ్బును ఒక్కొక్కటి రూ.2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ప్రధాని నవంబర్ 19, 2025న 21వ విడత నిధులను విడుదల చేయనున్నారు.
ఇప్పటివరకు దేశంలోని 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు 20 వాయిదాల ద్వారా రూ.3.70 లక్షల కోట్ల కంటే ఎక్కువ మొత్తం పంపిణీ చేయబడింది. ఈ డబ్బు రైతులు వ్యవసాయానికి, అలాగే విద్య, వైద్యం వంటి ఇతర ఖర్చులను తీర్చుకోవడానికి సహాయపడింది. ఈ పథకం పొందాలంటే, రైతు భూమి వివరాలు పీఎం-కిసాన్ పోర్టల్‌లో నమోదు అయి ఉండాలి. అలాగే, వారి బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఆధార్‌తో లింక్ అయి ఉండాలి.
పీఎం-కిసాన్ పథకం ద్వారా అందించే నిధులు గ్రామీణ ఆర్థిక వృద్ధికి ఉత్ప్రేరకంగా పనిచేసిందని, రైతులపై అప్పుల భారాన్ని తగ్గించి, వ్యవసాయ పెట్టుబడులు పెరగడానికి సహాయపడిందని ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది. రైతులు సంక్షేమ పథకాల ప్రయోజనాలను మరింత సులువుగా పొందేందుకు వీలుగా, వ్యవసాయ మంత్రిత్వ శాఖ కిసాన్ రిజిస్ట్రీ అనే కొత్త డేటాబేస్‌ను రూపొందించే పనిని ప్రారంభించింది.

