PM Kisan : 9.32 కోట్ల మంది రైతులకు పండుగ.. 22వ విడత నిధులపై కేంద్రం కీలక ప్రకటన
22వ విడత నిధులపై కేంద్రం కీలక ప్రకటన

PM Kisan : దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(PM-KISAN) కింద 22వ విడత నిధులను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారైంది. మార్చి 13న అస్సాంలోని గువహటి వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదును బదిలీ చేయనున్నారు. ఈ విడతలో మొత్తం 9.32 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.18,640 కోట్లను కేటాయించింది.
అయితే, ఈ డబ్బులు మీ అకౌంట్‌లో పడాలంటే ఒక ముఖ్యమైన పని పూర్తి చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు. లబ్ధిదారులు వెంటనే పీఎం కిసాన్ పోర్టల్‌లోకి వెళ్లి తమ వివరాలను వెరిఫై చేసుకోవాలని, ముఖ్యంగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉంటే నగదు జమ కావడంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన స్పష్టం చేశారు. రైతులు తమ పేమెంట్ స్టేటస్, ఆధార్ లింకింగ్, ల్యాండ్ సీడింగ్ వివరాలను పోర్టల్‌లోని నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ద్వారా సులభంగా చూసుకోవచ్చు.
రైతులకు సాయం చేసేందుకు ప్రభుత్వం టెక్నాలజీని జోడించింది. ఫేస్ ఆథెంటికేషన్ ఆధారిత మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా రైతులు ఎక్కడికీ వెళ్లకుండానే, ఓటీపీ లేదా వేలిముద్రల అవసరం లేకుండా కేవలం తన మొహాన్ని స్కాన్ చేయడం ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు. ఒకవేళ ఏవైనా సందేహాలు ఉంటే కిసాన్-ఈమిత్ర అనే ఏఐ వాయిస్ చాట్‌బాట్ సాయం తీసుకోవచ్చు. ఇది తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో రైతులకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది.
మరో విశేషమేమిటంటే.. ఈ 22వ విడత నిధులు అందుకుంటున్న వారిలో సుమారు 2.15 కోట్ల మంది మహిళా రైతులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు పంపిణీ చేసిన మొత్తం సొమ్ము రూ.4.27 లక్షల కోట్లు దాటడం విశేషం. ప్రతి సంవత్సరం అర్హులైన రైతు కుటుంబాలకు మూడు విడతల్లో రూ.2000 చొప్పున మొత్తం రూ.6000 సహాయాన్ని కేంద్రం అందిస్తోంది. పొరపాటున ఎవరైనా తమ బెనిఫిట్లను సరెండర్ చేసి ఉంటే, వాటిని తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం కూడా కల్పించారు.

