ఏటా రూ.36,000 పెన్షన్ పొందే సువర్ణావకాశం

PM Kisan Mandhan Yojana : రైతన్నల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తోంది. అందులో అత్యంత ప్రజాదరణ పొందినది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం ద్వారా ఏటా రూ.6,000 పొందుతున్న రైతులు చాలామంది ఉన్నారు. అయితే, ఇదే పథకాన్ని ఆధారం చేసుకుని, వృద్ధాప్యంలో నెలకు రూ.3,000 పెన్షన్ పొందే అవకాశం ఉందన్న విషయం చాలామందికి తెలియదు. పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన ద్వారా రైతులు తమ 60 ఏళ్ల తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవితాన్ని గడపవచ్చు.

పీఎం కిసాన్ లబ్ధిదారులు ఈ పెన్షన్ పథకంలో చేరడం చాలా సులభం. దీనికోసం మీరు మీ జేబులోంచి విడిగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఏటా మీకు వచ్చే రూ.6,000 పెట్టుబడి సాయం నుంచే పెన్షన్ ప్రీమియం కట్ అయ్యేలా మీరు అనుమతి ఇవ్వవచ్చు. అంటే, అటు పెట్టుబడి సాయం అందుతూనే.. ఇటు మీ పెన్షన్ ఖాతాకు జమ అవుతుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత మీకు ఏడాదికి అక్షరాలా రూ.36,000 పెన్షన్ రూపంలో నేరుగా మీ ఖాతాకు వస్తుంది.

ఈ పథకంలో చేరడానికి వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. మీరు ఎంత తక్కువ వయసులో ఈ స్కీమ్‌లో చేరితే, మీరు చెల్లించాల్సిన ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు కేవలం రూ.55 మాత్రమే ప్రీమియం ఉంటుంది. అదే 40 ఏళ్ల వయసులో చేరితే రూ.200 వరకు ఉంటుంది. మీరు ఎంత మొత్తం అయితే ప్రీమియంగా చెల్లిస్తారో, ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని మీ పెన్షన్ ఖాతాలో జమ చేస్తుంది. ఒకవేళ లబ్ధిదారుడు మరణిస్తే, అతని భార్యకు 50 శాతం పెన్షన్ పొందే హక్కు ఉంటుంది.

రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మీకు దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు ఇస్తే చాలు. చిన్న మరియు సన్నకారు రైతులందరికీ ఇదొక గొప్ప భరోసా. బుద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం ఎంతో ఉత్తమం. ఇప్పటివరకు లక్షలాది మంది రైతులు ఈ పథకంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story