PM Kisan : కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ అనౌన్స్మెంట్.. జూన్ 20న రైతుల అకౌంట్లలోకి రూ.2,000 జమ
జూన్ 20న రైతుల అకౌంట్లలోకి రూ.2,000 జమ

PM Kisan : రైతులు వానాకాలం పంటల సాగుకు సమాయత్తమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలోని కోట్లాది మంది రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న ప్రతిష్టాత్మక పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడత నిధుల పంపిణీ తేదీ ఖరారైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 23వ విడత నిధులు ఈ వారంలోనే రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా చేరనున్నాయి. దీంతో విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు సకాలంలో డబ్బులు అందుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
జూన్ 20న అకౌంట్లలోకి చేరనున్న రూ.2,000 వాయిదా
పీఎం కిసాన్ యోజన X హ్యాండిల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ పథకానికి సంబంధించిన 23వ విడత నిధులను జూన్ 20, 2026 న అధికారికంగా విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9 కోట్లకు పైగా అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా రూ.2,000 చొప్పున డిపాజిట్ చేయనున్నారు. ఇదివరకు 22వ విడత నిధులను మార్చి 13, 2026న పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేవలం మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే తదుపరి విడతను కూడా విడుదల చేయడానికి కేంద్ర ఆర్థిక, వ్యవసాయ శాఖలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.
ఏడాదికి రూ.6,000 పెట్టుబడి సాయం.. ఏడేళ్ల నమ్మకం
చిన్న, సన్నకారు రైతులను అప్పులపాలు కాకుండా కాపాడటమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం 2019వ సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి అర్హులైన రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6,000 చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా.. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తారు. విత్తనాల కొనుగోలు, భూమి దున్నకం, ఉపాధి కూలీల ఖర్చుల వంటి అత్యవసర వ్యవసాయ అవసరాలకు ఈ నగదు ఎంతో ఆసరాగా నిలుస్తోంది.
మధ్యవర్తులు లేని పారదర్శక నగదు బదిలీ
దేశంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకంగా పీఎం కిసాన్ గుర్తింపు పొందింది. గత 22వ విడత నిధుల పంపిణీ సమయంలో మోదీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఏకంగా రూ.18,640 కోట్లను ఒకే ఒక్క క్లిక్‌తో బదిలీ చేసింది. ఈ డిజిటల్ విధానం వల్ల రూపాయి కూడా పక్కదారి పట్టకుండా, ఎలాంటి లంచాల బెడద లేకుండా వంద శాతం నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకే చేరుతున్నాయి. పథకంలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం నిరంతరం అనర్హులను ఏరివేసే ప్రక్రియను కొనసాగిస్తోంది.
ఈ-కేవైసీ లేకుంటే నిధులు కట్.. కేంద్రం కఠిన నిబంధన
ఈసారి 23వ విడత డబ్బులు మీ ఖాతాలో పడాలంటే కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిబంధనను తప్పనిసరి చేసింది. లబ్ధిదారులైన రైతులు తమ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను జూన్ 20 లోపు కచ్చితంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ రైతుకైనా ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉంటే, వారి అకౌంట్లలోకి రూ.2,000 డబ్బులు జూన్ 20న బదిలీ కావు. నకిలీ లబ్ధిదారులను, ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పొందుతున్న లబ్ధిని అడ్డుకుని.. కేవలం నిజమైన భూ యజమానులైన రైతులకే సాయం అందించాలనే ఉద్దేశంతోనే ఈ వెరిఫికేషన్ ప్రక్రియను కఠినతరం చేశారు.
ఇంట్లోనే కూర్చుని మొబైల్ లో ఈ-కేవైసీ చేసుకునే స్టెప్స్
* మొదట పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in) సందర్శించాలి.
* హోమ్‌పేజీలో కుడివైపు కనిపించే “e-KYC” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబరును నమోదు చేయాలి.
* ఆధార్ కార్డ్‌కు లింక్ అయిన మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని (OTP) ఎంటర్ చేయాలి.
* వివరాలు సరిపోలితే మీ ఈ-కేవైసీ విజయవంతంగా పూర్తయినట్లు స్క్రీన్‌పై మెసేజ్ వస్తుంది.
ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఆధార్‌తో లింక్ కాకపోవడం వల్ల ఓటీపీ రాకుంటే.. సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీ సేవ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ విధానం ద్వారా ఈ-కేవైసీని పూర్తి చేసుకోవచ్చు.
మీ పేరు లిస్ట్‌లో ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి
మీ అకౌంట్ లోకి రాబోయే 23వ విడత డబ్బులు వస్తాయో లేదో తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌లోని Know Your Status ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్, స్క్రీన్‌పై ఉన్న క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. దీని ద్వారా మీ ఈ-కేవైసీ అప్‌డేట్ అయిందో లేదో, ల్యాండ్ సీడింగ్ సజావుగా ఉందో లేదో చాలా స్పష్టంగా స్క్రీన్‌పై చూసుకోవచ్చు. ఒకవేళ ఇవన్నీ గ్రీన్ కలర్ YES అని ఉంటే జూన్ 20న మీ అకౌంట్ లోకి రూ. 2,000 చేరడం ఖాయం.

