జీఎస్టీలో మార్పులు

GST Reforms : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పెద్ద బహుమతిని ప్రకటించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది దీపావళికి జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తామని ప్రకటించారు. ఈ మార్పుల ద్వారా దేశ ప్రజలకు పన్ను భారం తగ్గనుంది. జీఎస్టీ సమీక్షతో పాటు, ప్రధాని మోడీ ప్రధానమంత్రి వికసిత్ భారత్ యోజనను కూడా ప్రారంభించారు. ప్రజల డిమాండ్ మేరకు జీఎస్టీలో మార్పులు, సమీక్షలు జరగడం వల్ల నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుతాయని ఆయన అన్నారు.

ప్రధాని మాట్లాడుతూ.. జీఎస్టీలో సంస్కరణల వల్ల సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. దీనివల్ల ప్రజలు చెల్లించే పన్నులు తగ్గుతాయి. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈ రంగాలకు ఇది చాలా లాభదాయకం. ఈ మార్పుల వల్ల రోజువారీ ఉపయోగించే వస్తువుల ధరలు తగ్గుతాయి.

ప్రధాని మోడీ జీఎస్టీ సంస్కరణలతో పాటు దేశంలోని యువతకు కూడా శుభవార్త చెప్పారు. ఎర్రకోట నుండి ఆయన మాట్లాడుతూ.. "నా దేశ యువతకు శుభవార్త, ఈ రోజు మనం దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో ఒక కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నాము" అన్నారు. ఆగస్టు 15 నుండి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు.

ఈ పథకం కింద ప్రైవేట్ రంగంలో మొదటి ఉద్యోగం పొందిన యువకులకు, యువతులకు ప్రభుత్వం నుండి రూ.15,000 లభిస్తాయి. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీలకు కూడా ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఈ పథకం యువత కోసం సుమారు 3.5 కోట్ల కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని అంచనా. వీటితో పాటు, ప్రధాని వోకల్ ఫర్ లోకల్ను ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది పౌరులందరికీ ఒక మంత్రం కావాలని ఆయన అన్నారు.

Updated On 15 Aug 2025 1:07 PM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story