Coaching Industry: రూ.1.41 లక్షల కోట్ల కోచింగ్ సామ్రాజ్యానికి బిగ్ షాక్.. ప్రధాని ప్రకటనతో మార్కెట్లో కలకలం
ప్రధాని ప్రకటనతో మార్కెట్లో కలకలం

Coaching Industry: పెద్ద కుదుపు మొదలైంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుపేద విద్యార్థుల కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన విద్యా రంగంలో కొత్త విప్లవానికి తెరలేపింది. ఈ నిర్ణయంతో కోటా, ఢిల్లీ వంటి పెద్ద కోచింగ్ హబ్‌ల ఆధిపత్యానికి గండిపడనుంది. భారతదేశంలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ మార్కెట్ పరిమాణం విపరీతంగా పెరిగింది. రెడ్‌సీర్ నివేదిక ప్రకారం మనదేశంలో టెస్ట్ ప్రిపరేషన్ మార్కెట్ విలువ ప్రసుతం 14.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.41 లక్షల కోట్లు)గా ఉంది. 2030 నాటికి ఇది వార్షికంగా 12 నుంచి 15 శాతం వృద్ధితో 23 నుంచి 26 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు, టాప్ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం కోటా, ఢిల్లీ వంటి నగరాలకు వెళ్తున్నారు. ప్రధాని మోదీ ప్రకటించిన ఉచిత ఆన్‌లైన్ కోచింగ్, కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ట్రైనింగ్ పథకాలు ఈ నగర ఆధారిత వ్యవస్థను డిజిటల్ వైపునకు వేగంగా నడిపిస్తాయి.
చిన్న పట్టణాల వైపు అడుగులు వేస్తున్న దిగ్గజ సంస్థలు
ప్రభుత్వం నుంచి రాబోతున్న ఈ ఉచిత డిజిటల్ విప్లవానికి పోటీగా ప్రైవేట్ సంస్థలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఆకాశ్, అలెన్ వంటి బడా కోచింగ్ సెంటర్లు ఇప్పుడు చిన్న పట్టణాలపై దృష్టి సారిస్తున్నాయి. ఆకాశ్ సంస్థ కరియర్ రథ్ పేరుతో 28 రాష్ట్రాలలోని 251 నగరాల్లో ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించింది. టైర్-2, టైర్-3 నగరాల విద్యార్థులు తమ ఇళ్లను దాటకుండానే నాణ్యమైన శిక్షణ కోరుకుంటున్నారు. ఐఐటీలలో ఎంపికైన వారిలో 51 శాతం, మెడికల్ కాలేజీల్లో చేరిన వారిలో 63 శాతం మంది చిన్న పట్టణాలు, పల్లెల నుంచి వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
క్లాస్‌రూమ్ చదువుల ప్రాధాన్యం తగ్గుతుందా?
డిజిటల్ కోచింగ్ ఎంత పెరిగినా క్లాస్‌రూమ్ పాఠాలకు ఉండే ఆదరణ తగ్గదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆన్‌లైన్ సాధనాలు ప్రాక్టీస్, రివిజన్‌కు బాగా ఉపయోగపడతాయి. భౌతిక కేంద్రాలు విద్యార్థులకు ఒక క్రమశిక్షణ, టీచర్లతో నేరుగా అనుమానాలు నివృత్తి చేసుకునే వెసులుబాటు, పోటీ వాతావరణాన్ని అందిస్తాయి. అందుకే ప్రైవేట్ సంస్థలు చిన్న పట్టణాల్లో కూడా తమ స్వంత కేంద్రాలను తెరిచేందుకు మొగ్గు చూపుతున్నాయి. ప్రభుత్వ పథకం ప్రారంభంలో ఉచిత అవగాహన కల్పిస్తే, తదనంతర శిక్షణ కోసం ఆన్‌లైన్ యాప్‌లు, హైబ్రిడ్ మోడళ్లను ఆశ్రయించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
నాణ్యమైన ఉపాధ్యాయుల లభ్యతే ప్రధాన సవాలు
చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లు నిర్వహించడం అనుకున్నంత సులభం కాదు. నాణ్యమైన ఉపాధ్యాయులను కనుగొనడం, మౌలిక సదుపాయాలు కల్పించడం పెద్ద సవాలుగా మారింది. అలెన్ వంటి సంస్థలు ప్రతి సంవత్సరం 1,000 మందికి పైగా టీచర్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఉపాధ్యాయ ఆధారిత బోధనకు డిజిటల్ టెక్నాలజీ తోడైనప్పుడే విద్యార్థులకు సరైన విజయం అందుతుందని రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు.

