Narayana Murthy : మోడీ వారానికి 100గంటలు పనిచేస్తున్నారు.. నారాయణ మూర్తి వ్యాఖ్యలు వైరల్
నారాయణ మూర్తి వ్యాఖ్యలు వైరల్

Narayana Murthy : ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలు మళ్లీ వార్తల్లోకి వచ్చాయి. గతంలో యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇప్పుడు ఆయన అదే పని గంటల గురించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యతో మాట్లాడారు. ఆ సందర్భంగా నారాయణ మూర్తి ప్రధాని నరేంద్ర మోడీ గురించి చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముంబై నుంచి బెంగళూరుకు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తేజస్వి సూర్య ఆకస్మికంగా నారాయణ మూర్తిని కలుసుకున్నారు. ఈ భేటీ గురించి తేజస్వి సూర్య తన X ఖాతాలో పంచుకున్నారు. ఈ సంభాషణను ఆయన భారతదేశ భవిష్యత్తు, నాయకత్వంపై రెండు గంటల మాస్టర్ క్లాస్ అని అభివర్ణించారు. వారు భారతదేశ సాంకేతిక అభివృద్ధి, నగరాల పరిస్థితి, యువత నైపుణ్యాలు, నాయకత్వం, పాలసీల గురించి సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఈ సంభాషణలో నారాయణ మూర్తి తన అపారమైన జ్ఞానాన్ని పంచుకున్నారని తేజస్వి సూర్య తెలిపారు.
ఈ సంభాషణలో నారాయణ మూర్తి తన వారానికి 70 గంటల పని అంశం గురించి కూడా ప్రస్తావించారు. ఆ సందర్భంగా ఆయన నవ్వుతూ ఒక ముఖ్యమైన విషయం చెప్పారని తేజస్వి సూర్య పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వారానికి 100 గంటలు పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నారాయణ మూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అయ్యాయి. గతంలో ఆయన యువత ఎక్కువ గంటలు పని చేయాలన్నప్పుడు కొంతమంది సమర్థించారు. మరికొంతమంది విమర్శించారు. ఎక్కువ గంటలు పని చేస్తేనే విజయం వస్తుందనడం సరికాదని, నాణ్యత ముఖ్యం అని చాలా మంది అభిప్రాయపడ్డారు.
