PM Modi: దేశంలోని బడా ప్రైవేట్ కంపెనీల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలో జరిగిన FICCI వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పరిశ్రమలకు ఎన్నో రాయితీలు ఇస్తున్నా, దాని ఫలితం సామాన్య ఉద్యోగులకు ఎందుకు అందడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామని, వ్యాపార నిర్వహణను సులభతరం చేశామని గుర్తు చేసిన ప్రధాని, మరి కంపెనీలు కొత్త నియామకాలను గానీ, ఉద్యోగుల జీతాలను గానీ పెంచాయా అని నిలదీశారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, ప్రభుత్వ గణాంకాలు, కంపెనీల ఆర్థిక నివేదికలు ప్రధాని ఆందోళనను సమర్థిస్తున్నాయి.

కంపెనీల లాభాలతో పోలిస్తే ఉద్యోగులపై పెట్టే ఖర్చు చాలా తక్కువగా ఉందని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక స్పష్టం చేస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 4,046 కంపెనీల నికర లాభం సుమారు 19 శాతం ఎగబాకగా, ఉద్యోగుల జీతాల బిల్లు కేవలం 9 శాతం మాత్రమే పెరిగింది. అంతకుముందు FY24లోనూ లాభాలు 32 శాతం పెరిగితే, వేతనాల ఖర్చు 12.5 శాతమే పెరిగింది. కంపెనీల మొత్తం ఖర్చులో ఉద్యోగుల వాటా 11.4 శాతం నుంచి 12.6 శాతం మధ్యే నిలిచిపోయింది. మరోవైపు సెప్టెంబర్ చివరి నాటికి భారత కంపెనీల వద్ద ఐదేళ్ల గరిష్ఠ స్థాయిలో రూ.12.8 లక్షల కోట్ల నగదు నిల్వలు పేరుకుపోయాయి. మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ప్రకారం నిఫ్టీ 500 కంపెనీల నికర లాభం FY20లో రూ.5 లక్షల కోట్ల లోపు ఉండగా, FY26లో రూ.20 లక్షల కోట్లకు చేరువవుతోంది. దేశ జీడీపీలో కార్పొరేట్ లాభాల వాటా 2 శాతం నుంచి 5 శాతం దాటడం విశేషం.

కంపెనీల ఖజానాలు నిండుతున్నా ఫ్యాక్టరీల్లో పనిచేసే సామాన్య కార్మికుల ఆదాయం మాత్రం పెరగడం లేదని యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ (ASI) గణాంకాలు చెబుతున్నాయి. 2024-25లో ఫ్యాక్టరీ కార్మికుల జీతాలు కాగితాలపై 5.3 శాతం పెరిగినప్పటికీ, నిత్యావసర వస్తువుల ధరలు (ద్రవ్యోల్బణం) 4.6 శాతం పెరిగాయి. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తీసివేస్తే కార్మికుల అసలు సంపాదన కేవలం 0.7 శాతం మాత్రమే పెరిగింది. గత మూడేళ్లుగా కార్మికుల నిజమైన ఆదాయంలో చెప్పుకోదగ్గ మార్పు లేదని, పైగా ఫ్యాక్టరీ కార్మికులు, మేనేజర్ల జీతాల మధ్య వ్యత్యాసం మరింత పెరిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

కేవలం జీతాల విషయంలోనే కాకుండా కొత్త ఉద్యోగాల కల్పనలోనూ ప్రైవేట్ రంగం వేగం తగ్గించింది. గతంలో ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, కన్జ్యూమర్ రంగాలు వేతన వృద్ధికి అండగా నిలిచాయి. కానీ ఇటీవల పెద్ద కంపెనీలు, బ్యాంకులు కొత్త నియామకాలను తగ్గించాయని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక పేర్కొంది. కేర్‌ఎడ్జ్ డేటా ప్రకారం.. దేశ మొత్తం ఉపాధిలో సేవా రంగం వాటా 2000 సంవత్సరంలో 22.9 శాతం ఉండగా, 2025 నాటికి 31.8 శాతానికి పెరిగింది. అదే సమయంలో తయారీ రంగం వాటా మాత్రం 10 నుంచి 12 శాతం వద్దే స్థిరంగా ఉండిపోయింది.

ప్రధాని మోదీ చేసిన తాజా వ్యాఖ్యలతో ప్రైవేట్ రంగం పనితీరుపై మరోసారి చర్చ మొదలైంది. కంపెనీలు తమ మానవ వనరులపై (ఉద్యోగులపై) ఎంత పెట్టుబడి పెడుతున్నాయి, కొత్త ఆవిష్కరణలు (ఇన్నోవేషన్), ఉత్పత్తుల నాణ్యత విషయంలో ఎంత శ్రద్ధ చూపుతున్నాయనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కార్పొరేట్ దిగ్గజాలను ఇదే తరహాలో ప్రశ్నించారు. ఇప్పుడు స్వయంగా ప్రధాని రంగంలోకి దిగి హెచ్చరించడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Next Story