PM Modi : భారతదేశంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి, యువతకు సామాజిక భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు 1, 2025 న ప్రవేశపెట్టిన PM-VBRY అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 70 లక్షల మందికి పైగా యువతకు కొత్తగా ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు లభించాయి. కేవలం ఉద్యోగాలు కల్పించడమే కాకుండా, వారిని ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకురావడం ద్వారా సామాజిక భద్రతను కూడా కల్పించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా రూ.2,400 కోట్లు

ఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంప్యూటర్ బటన్ నొక్కి ఒకేసారి 15 లక్షల మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహక నిధులను డిబిటి ద్వారా నేరుగా బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నిధులు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కావని, దేశాభివృద్ధి కోసం యువత పడుతున్న కష్టానికి, వారి భవిష్యత్తుపై ప్రభుత్వం ఉంచిన నమ్మకానికి నిదర్శనమని కొనియాడారు. ఇప్పటికే 20 లక్షల మంది యువకులు తమ మొదటి ఉద్యోగంలో ఆరు నెలల కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారని ఆయన తెలిపారు.

ఉద్యోగులతో పాటు యాజమాన్యాలకు కూడా లబ్ధి

సాధారణంగా ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు కేవలం కార్మికులకు లేదా కంపెనీల యాజమాన్యాలకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తాయి. కానీ, ఈ పీఎంవీబీఆర్‌వై స్కీమ్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది ఒకే సమయంలో ఇటు ఉద్యోగులను, అటు సంస్థలను సమానంగా ఆదుకుంటుంది. ఈ పథకం కింద నెలకు రూ.1 లక్ష లోపు జీతం ఉండి, మొదటిసారి ఉద్యోగంలో చేరే వారికి ఒక నెల జీతానికి సమానమైన అమౌంట్‌ను (గరిష్టంగా రూ.15,000) ప్రభుత్వం రెండు విడతల్లో నేరుగా అందిస్తుంది. అదే సమయంలో కొత్త ఉద్యోగులను చేర్చుకునే కంపెనీలకు కూడా ప్రతి అదనపు ఉద్యోగిపై నెలకు రూ.3,000 చొప్పున రెండేళ్ల పాటు ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇస్తుంది.

పదేళ్లలో 17 కోట్ల ఉద్యోగాల సృష్టి

ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయ దేశ ఉద్యోగ రంగానికి సంబంధించిన కీలక గణాంకాలను వెల్లడించారు. 2014 నుంచి 2024 మధ్య కాలంలో దేశంలో రికార్డు స్థాయిలో దాదాపు 17 కోట్ల ఉద్యోగాలు లభించాయని, అంతకుముందు పదేళ్లలో ఈ సంఖ్య కేవలం 2.9 కోట్లు మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం భారతదేశంలో నిరుద్యోగిత రేటు కేవలం 3.1 శాతానికి పడిపోయిందని, ఇది ప్రపంచ సగటు నిరుద్యోగ రేటు అయిన 4.8 శాతం కంటే చాలా తక్కువగా ఉండటం విశేషమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

మహిళా సాధికారత, ఈపీఎఫ్ఓ ఆధునీకరణ

దేశ ఆర్థిక ప్రగతిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని పీఎం మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహిళలు నైట్ షిఫ్ట్‌లలో సురక్షితంగా పనిచేయడానికి, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్లను ఉపయోగించుకోవడానికి వీలుగా కార్మిక చట్టాలను సవరించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ పథకం కింద లబ్ధి పొందిన వారిలో 30 శాతం మంది మహిళలే ఉండటం గర్వకారణమన్నారు. దీనితో పాటు ఈపీఎఫ్ఓను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేసి, కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్, పీఎఫ్ విత్‌డ్రా ప్రాసెస్ మరింత సులభతరం చేసినట్లు ప్రధాని వివరించారు.

రూ.99,446 కోట్ల భారీ బడ్జెట్

మొత్తం రూ.99,446 కోట్ల భారీ బడ్జెట్ కేటాయింపులతో నడుస్తున్న పీఎంవీబీఆర్‌వై పథకం ప్రధాన లక్ష్యం.. రెండేళ్ల కాలంలో దేశంలో 3.5 కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించడం. ఇందులో భాగంగానే మొదటిసారి ఉద్యోగ మార్కెట్లోకి అడుగుపెట్టే 1.92 కోట్ల మంది యువతకు పూర్తి స్థాయి సామాజిక భద్రతా ప్రయోజనాలను కల్పించనున్నారు. మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్, డిజిటల్ ఎకానమీ, స్టార్టప్ రంగాలలో వస్తున్న విప్లవాత్మక మార్పులు రాబోయే రోజుల్లో దేశాన్ని గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story