PM Surya Ghar : భారతదేశంలో స్వచ్ఛ ఇంధన విప్లవం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన దేశంలో కోట్లాది కుటుంబాల వెలుగులకు కారణమవుతోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం... దేశవ్యాప్తంగా ఇప్పటికే 36.47 లక్షలకు పైగా ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ అమర్చడం పూర్తయింది. అలాగే 44.32 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నాయి. అయితే, ఈ పథకం ద్వారా వచ్చే ఉచిత విద్యుత్ ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో అందుకోవాలంటే సోలార్ ప్యానెల్స్ వాడకంలో ఒక ముఖ్యమైన అలవాటును పెంపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్యానెల్స్ నిర్వహణ సరిగ్గా లేకపోతే విద్యుత్ ఉత్పత్తి ఏకంగా 5 నుండి 30 శాతం వరకు తగ్గిపోయే ప్రమాదం ఉంది.

దుమ్ము, ధూళి చేరితే భారీ నష్టం

ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, సోలార్ ప్యానెల్స్‌పై దుమ్ము, మట్టి, వాహనాల పొగ, ఎండిపోయిన ఆకులు, పక్షుల రెట్టలు పేరుకుపోవడం వల్ల సూర్యరశ్మి ప్యానెల్ లోపల ఉండే సెల్స్‌కు సరిగ్గా చేరదు. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పడిపోతుంది. మే నెలలోనే దేశవ్యాప్తంగా సుమారు 3.16 లక్షల ఇళ్లపై సరికొత్తగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి ఆల్‌టైమ్ హై రికార్డును నమోదు చేశారు. అంటే లక్షలాది మంది ప్రజలు మొదటిసారిగా తమ సొంత ఇంటిపై కరెంట్ తయారు చేసుకుంటున్నారు. ఇలాంటప్పుడు ప్యానెల్స్ పూర్తి కెపాసిటీతో పనిచేయాలంటే వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ఎంతో ముఖ్యం. ప్యానెల్స్ క్లీన్ చేయడానికి కేవలం నెలకు కొన్ని నిమిషాల సమయం కేటాయిస్తే సరిపోతుంది, దీనికోసం రూపాయి కూడా అదనపు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.

రిజిస్టర్డ్ వెండర్స్ నుంచి 5 ఏళ్ల వారంటీ

పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం కింద ప్యానెల్స్ అమర్చే రిజిస్టర్డ్ వెండర్స్ ప్రతి లబ్ధిదారునికి 5 సంవత్సరాల పాటు పూర్తి మెయింటెనెన్స్ (రహదారీ) గ్యారెంటీని అందిస్తున్నారు. దీనివల్ల సామాన్య కుటుంబాలకు దీర్ఘకాలిక భద్రత, నమ్మకం లభిస్తాయి. ప్రభుత్వం ఇలాంటి గొప్ప సపోర్ట్ అందిస్తున్నప్పుడు, వినియోగదారులుగా మనం కూడా ఒక చిన్న బాధ్యతను తీసుకోవాలి. అదే ప్యానెల్స్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం. ప్యానెల్స్ మురికిగా మారితే అవి తక్కువ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా మీకు రావాల్సిన ఉచిత కరెంట్ కోటా తగ్గి, నెలాఖరున విద్యుత్ బిల్లు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. అంతేకాకుండా, ప్యానెల్స్‌పై ఎక్కువ రోజులు మురికి పేరుకుపోతే అవి శాశ్వతంగా పాడైపోయే అవకాశం కూడా ఉంది.

మధ్యాహ్నం పూట సోలార్ ప్యానెల్స్ అస్సలు కడగకూడదు

సోలార్ ప్యానెల్స్ శుభ్రం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా మీరు ఇండస్ట్రియల్ ఏరియాల్లో లేదా ఎక్కువ దుమ్ము, ధూళి వచ్చే ప్రాంతాల్లో నివసిస్తుంటే నెలకు ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. అయితే, ప్యానెల్స్ కడగడానికి ఉదయం వేళ లేదా సాయంత్రం సమయం మాత్రమే అత్యంత ఉత్తమమైనది. పొరపాటున కూడా మధ్యాహ్నం వేళ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వాటిపై నీళ్లు పోసి కడగకూడదు. ఎందుకంటే మధ్యాహ్నపు ఎండకు ప్యానెల్స్ పై ఉండే గ్లాస్ బాగా వేడెక్కి ఉంటుంది. ఆ వేడి గ్లాస్ మీద ఒక్కసారిగా చల్లటి నీరు పడటం వల్ల థర్మల్ షాక్ జరిగి ఆ గ్లాస్ పగిలిపోయే లేదా పగుళ్లు ఇచ్చే ప్రమాదం ఉంది.

సోలార్ ప్యానెల్స్ క్లీన్ చేయడానికి సింపుల్ స్టెప్స్

* సిస్టమ్ ఆఫ్ చేయండి: ప్యానెల్స్ కడిగే ముందు ఇంట్లోని ఇన్వర్టర్, డీసీ ఐసోలేటర్ను పూర్తిగా ఆఫ్‌ చేయండి. కరెంట్ సప్లై ఆన్‌లో ఉన్నప్పుడు అస్సలు క్లీన్ చేయకూడదు.

* చల్లబడనివ్వండి: సిస్టమ్ ఆఫ్ చేశాక ప్యానెల్స్ వేడి తగ్గడానికి కనీసం 30 నిమిషాల పాటు అలాగే వదిలేయండి.

* పొడి దుమ్ము తుడవడం: ప్యానెల్స్ పై ఉన్న ఎండిన ఆకులు, పొడి దుమ్మును ఏదైనా మెత్తటి బ్రష్ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌తో మెల్లగా తుడిచేయండి.

* తడి బట్టతో క్లీనింగ్: తక్కువ లవణాలు ఉన్న మామూలు నీటిని ఉపయోగించి మెత్తటి స్పాంజ్ లేదా మాప్ సహాయంతో ప్యానెల్స్‌ను ఒకే సరళరేఖలో తుడవాలి.

* నీటితో కడగడం: చివరగా మిగిలిపోయిన మురికిని వదిలించడానికి శుభ్రమైన నీటితో ప్యానెల్స్ పై భాగాన్ని పూర్తిగా కడిగేయండి.

* తనిఖీ చేయడం: ప్యానెల్స్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత గ్లాస్‌పై ఎక్కడైనా పగుళ్లు లేదా డ్యామేజ్ జరిగిందో లేదో జాగ్రత్తగా చూడండి. ఒకవేళ ఏదైనా నష్టం కనిపిస్తే వెంటనే మీ సోలార్ ఇన్‌స్టాలర్‌కు సమాచారం ఇవ్వండి.

* మళ్లీ ప్రారంభించడం: అంతా బాగుంది అనుకున్నాక, సిస్టమ్ ఆన్ చేసేటప్పుడు మొదట డీసీ ఐసోలేటర్‌ను ఆన్ చేసి, ఆ తర్వాతే ఇన్వర్టర్ స్విచ్ ఆన్ చేయాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story