మీరు పెట్టిన ప్రతి పైసా డబుల్

Post Office : పోస్టాఫీసు అందించే పొదుపు పథకాలలో కిసాన్ వికాస్ పత్రకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పేరులో కిసాన్ అని ఉన్నప్పటికీ, దేశంలోని ఏ పౌరుడైనా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో బ్యాంక్ ఎఫ్‌డీల కంటే మెరుగైన వడ్డీని ఈ పథకం అందిస్తోంది. ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా పెట్టుబడిదారులకు పూర్తి భద్రతతో పాటు నిర్ణీత కాలంలో డబ్బును రెట్టింపు చేసే హామీని ఇస్తుంది. ఈ పథకంలో చేరడానికి మీరు లక్షల రూపాయలు కలిగి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం రూ.1,000 తోనే మీ పెట్టుబడిని ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడిపై ఎటువంటి పరిమితి లేదు. అంటే మీరు ఎంత మొత్తాన్నైనా ఇందులో దాచుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన ఎవరైనా తమ సమీపంలోని పోస్టాఫీసులో ఈ ఖాతాను తెరవవచ్చు. చిన్నారుల పేరిట తల్లిదండ్రులు కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.

ఎప్పుడు డబ్బులు డబుల్ అవుతాయి?

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కిసాన్ వికాస్ పత్రపై 7.5 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ రేటు ప్రకారం.. మీరు డిపాజిట్ చేసిన సొమ్ము 115 నెలల్లో (అంటే 9 ఏళ్ల 7 నెలల్లో) ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు, మీరు ఈ రోజు రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే, 115 నెలల తర్వాత పోస్టాఫీసు మీకు రూ.10 లక్షలను తిరిగి ఇస్తుంది. మధ్యలో వడ్డీ రేట్లు మారినా, మీరు చేరినప్పుడు ఉన్న రేటు కాలపరిమితి ముగిసే వరకు వర్తిస్తుంది.

అవసరమైతే మధ్యలోనే విత్‌డ్రా చేసుకోవచ్చా?

చాలామందికి ఉండే సందేహం ఇదే. కిసాన్ వికాస్ పత్రలో లిక్విడిటీ సౌకర్యం కూడా ఉంది. మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైతే, పెట్టుబడి పెట్టిన 30 నెలల (రెండున్నర ఏళ్ల) తర్వాత ఎప్పుడైనా మీ సొమ్మును వెనక్కి తీసుకోవచ్చు. అయితే మెచ్యూరిటీ కంటే ముందే విత్‌డ్రా చేసుకుంటే వడ్డీలో కొంత వ్యత్యాసం ఉంటుంది. ఇది కాకుండా ఈ సర్టిఫికెట్లను ఒకరి పేరు నుంచి మరొకరి పేరు మీదకు లేదా ఒక పోస్టాఫీసు నుంచి మరొక పోస్టాఫీసుకు సులభంగా బదిలీ చేసుకోవచ్చు.

ఎవరికి ఇది బెస్ట్ ఛాయిస్?

రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు, తమ పిల్లల ఉన్నత చదువుల కోసం లేదా రిటైర్మెంట్ అవసరాల కోసం పక్కాగా డబ్బులు కావాలనుకునే వారికి ఇది సరైన మార్గం. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, మీరు పెట్టిన రూపాయికి రెండు రూపాయలు చేతికి వస్తాయనే భరోసా ఈ స్కీమ్ సొంతం. ఆదాయపు పన్ను చట్టం కింద ఇందులో పన్ను మినహాయింపులు లేనప్పటికీ, భద్రత విషయంలో దీనిని మించిన పథకం మరొకటి లేదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story